గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పాత మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది.
సిపిఐ తరపున ఈ డివిజన్ నుంచి పోటీపడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సిపిఎం గుర్తును చూసి అవాక్కై, విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టిఆర్‌ఎస్ పార్టీల నేతలు గొడవకు దిగినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ.. డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
వీలైతే రేపే ఇక్కడ రీపోలింగ్ ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బ్యాలెట్ పేపరుపై గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి రావడం గమనార్హం. ఈసీ నుంచి ఆదేశాలు రాగానే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది పోలింగ్‌ను ఆపి తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను కూడా నిషేధించినట్లు ఎస్ఈసీ పార్థసారధి చెప్పారు. రీపోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.
ఇలా ఉండగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కేవలం 18.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. నగరంలోని యువత మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం, 11 గంటల వరకు 8.9 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదవ్వడాన్ని బట్టి చూస్తే ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 46 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈ సారి పోలింగ్ శాతం మరింత పెంచాలని ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించన్నట్లు స్పష్టం అవుతున్నది. కరోనా వ్యాప్తి కారణంగా బయటికి వచ్చి ఓటు వేసేందుకు ప్రజలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అయినా నగర వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటూ కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రకటనలు సహితం చాలా తక్కువగా పోలింగ్ జరగడానికి దారితీసిన్నట్లు కనిపిస్తున్నది.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం