కెనడా ప్రధాని వ్యాఖ్యల పట్ల భారత్ అభ్యంతరం 

భారత్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అరకొర సమాచారం ఆధారం చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమని స్పష్టం చేసింది. 
 
మీడియా సమవేశంలో పాత్రికేయులు కెనడా ప్రధాని ప్రస్తావన తేగా..విదేశంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు. భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం. ‘అరకొర సమాచారంతో కెనడాకు చెందని కొందరు నేతలు భారత్‌లోని రైతు నిరసనలపై స్పందించడం మనం చూశాం. అయితే ఇటువంటి వ్యాఖ్యలు..అది కూడా భారత్ అంతర్గత విషయాలపై చేయడం అనవసరం” అంటూ స్పష్టం చేశారు. 
 
పైగా,  దౌత్యపరమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయావసరాల కోసం తప్పుడు నిర్వచనాలు ఇవ్వడం సబబు కాదని అనురాగ్ శ్రీవాత్సవ హితవు చెప్పారు.  కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. 
 
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్న ఆయన రైతులకే తమ మద్దతు అన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే  వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాం అని కూడా ఆయన చెప్పారు. 
 
దీనిపై మహరాష్ట్రలోని అధికార పక్షం శివసేన కూడా ఘాటుగానే స్పందించింది. భారత్ దేశ అంతర్గత విషయాల్లో కలుగచేసుకోవద్దని స్పష్టం చేసింది. 
 
‘‘డియర్ జస్టిన్, మీరు స్పందించారు సరే… కానీ.. ఇది భారత దేశ అంతర్గత వ్యవహారం. ఇది ఇతర దేశాల రాజకీయాలకు మేతగా మారకూడదు. ఇతర దేశాల పట్ల భారత దేశం చూపించే మర్యాదను మీరు దృష్టిలో ఉంచుకోండి. కెనడా లాగా ఇతర దేశాలూ కామెంట్స్ చేయకముందే ప్రధాని మోదీ ఈ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నా.’’ అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.