వాహన కాలుష్యం కట్టడికి మరో కొత్త ప్రతిపాదన  

వాహన కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం మరో కొత్త ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పీయూసీ సర్టిఫికేట్లు లేని వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కూడా స్వాధీనం చేసుకోవాలనే కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు  సంబంధించి ముసాయిదాను నిబంధనను నవంబర్ 27ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరింది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ దిశగా ప్రభుత్వం విస్త్రత విధివిధానాలను రూపొందించిందని తెలుస్తోంది. వీటి ప్రకారం..ప్రజలు తమ వాహనాల పీయూసీ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి మొబైల్ నెంబర్ల‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు (ఓటీపీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీలు లేని పక్షంలో పీ యూసీ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ కుదరదని సమాచారం. సమాచార భద్రత దృష్ట్యా కేంద్రం ఈ విధానానికి మొగ్గు చూపింది.

కాగా.. సరైన పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాల యజమానులకు వీటిని పొందేందుకు తొలుత అధికారులు ఏడు రోజుల గడువు ఇస్తారు. అప్పటికీ తమ తీరు మార్చుకోని వారి ఆర్‌సీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకుంటారు. ఈ నిబంధన కమర్షియల్ వాహనాలకు కూడా వర్తించనుంది.

ఇటీవల వాయు కాలుష్యం, తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా చలికాలంలో రాజధాని ఢిల్లీ పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. నగరంలోని కాలుష్య స్థాయిలను తెలిపే ఎయిర్ క్వాలటీ సూచి(ఏక్యూఐ) శనివారం నాడు 231గా నమోదైంది.

గాలి వేగం తగ్గుతుండటంలో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం… ఏక్యూఐ సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే వాయుకాలుష్య పరిస్థితి బాగున్నట్టు లెక్క. 51-100 మధ్య ఏక్యూఐని సంతృప్తి కరంగా ఉన్నట్టు, 100-200 మధ్య ఉంటే మధ్యస్థంగా, 201-300 మధ్య ఉంటే దిగదుడుపుగా, 301-400 మధ్య ఉంటే మరింత దిగదుడుపుగా, 401-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.