రైతు సమస్యల పరిష్కారంకు కేంద్రం సిద్ధం 

 
 రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు,  రైతు సంఘాల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ప్రకటించారు. డిసెంబ‌ర్ మూడ‌వ తేదీన చ‌ర్చ‌ల‌కు రైతు సంఘాల‌ను ఆహ్వానించిన‌ట్లు మంత్రి తెలిపారు. 
 
 కొత్త వ్య‌వసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్ రైతులు  ఢిల్లీలో ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.  అయితే తాము నిర్వ‌హించ‌బోయే స‌మావేశాల‌కు రైతులు హాజ‌రు అవుతార‌ని మంత్రి తోమ‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  రైతుల పేరుతో పార్టీలు  రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌ని మంత్రి  హితవు చెప్పారు. 
 
కాగా, రైతుల స‌మ‌స్య‌ల‌ను రాజ‌కీయం చేస్తున్న‌ట్లు హ‌ర్యానా ముఖ్యమంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ఆరోపించారు. పంజాబ్ రైతులు ఆందోళ‌న చేప‌డుతున్నార‌ని, హ‌ర్యానా రైతులు ఆ నిర‌స‌న‌కు దూరంగా ఉన్నార‌ని స్పష్టం చేశారు.  ఎంతో సంయ‌మ‌నం పాటించిన హ‌ర్యానా రైతులు, పోలీసుల‌కు ఆయ‌న ధన్యవాదాలు తెలిపారు. 
 
ఆందోళ‌న‌ల‌కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌ ఆజ్యం పోస్తున్నార‌ని ఖ‌ట్ట‌ర్ ఆరోపించారు.   సీఎం కార్యాలయంలోని ఆఫీస్ బేరర్లే ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. పంజాబ్ ముఖ్యమంత్రిని సంప్రదించేందుకు తాను మంగళవారం నుంచీ ప్రయత్నిస్తున్నానని, అయితే అటువైపు నుంచి స్పందన లేదని కూడా ఆయన తెలిపారు. 
అయితే, కేంద్రం ఇటీవ‌ల తీసుకొచ్చిన రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు త‌మ పోరాటాన్ని అపేది లేద‌ని రైతులు స్పష్టం చేస్తున్నారు. బురారీలోని నిరంకారీ స‌మాగం గ్రౌండ్‌లో రైతులు బైఠాయించి కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. రైతుల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌న్న కేంద్ర‌మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ ప్ర‌క‌ట‌న‌ను వారు తోసిపుచ్చారు. తాము కేంద్ర ప్ర‌భుత్వాన్ని న‌మ్మేదిలేద‌ని రైతులు స్ప‌ష్టంచేశారు. గ‌తంలో కూడా ప్ర‌భుత్వం రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని, అయితే వాటికి ఎలాంటి ప‌రిష్కారం ల‌భించ‌లేద‌ని గుర్తుచేశారు.