ఎట్టకేలకు అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం 

ఎన్నికలు జరిగి మూడు వారాలైనా ఓటమిని అంగీకరించకుండా  అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ప్రస్తుత   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు అధికార బదిలీకి అంగీకరించారు. అమెరికా కోర్టుల్లో ట్రంప్  వేస్తున్న కేసులు తిరస్కరణకు గురువుతున్న నేపథ్యంలో బైడెన్‌కు అధికార పగ్గాలు బదిలీ చేసేందుకు అంగీకరించారు. 

బైడెన్‌కు పాలనాధికారాలు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు శ్వేత శౌధం, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బైడెన్ గెలుపును అంగీకరించినట్టు ట్రంప్ విస్పష్ట ప్రకటన ఏదీ చేయనప్పటికీ, అధికార బదిలీ ప్రక్రియను అనుమతించిడం గమానార్హం. 

అయితే తన పోరాటం ఆగదని, అంతిమ విజయం తనదేనని యథావిథిగా తనదైన శైలిలో ట్రంప్ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం తెలుపకు మునుపు ప్రభుత్వంలో అనేక కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జో బైడెన్‌కు అధికార బదిలీకి సంబంధించి కీలక పత్రాలను పరిశీలించేందుకు జనరల్ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్ ఎమిలీ మర్ఫీ నిరాకరించారు. దీనిపై అమెరికాలో పెను దుమారమే చెలరేగింది. ఎమిలీపై పార్టీలకతీతంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.

డెమాక్రెటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు ముక్తకంఠంతో జీఎస్ఏ విభాగం తీరుపై మండిపడ్డారు. చట్టపరమైన విషయాల తప్పొప్పులను నిర్ణయించే బాధ్యత జీఎస్ఏది కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ఎమిలీ జో బైడెన్‌కు లేఖ రాశారు. అనుమతి నిరాకరించడమనేది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయమని, ఎవరి ఒత్తడీ లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

కాగా లేఖ వేలువడిన కొద్ది గంటలకే ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. ఎమిలీ సేవలను, అమెరికా ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఆమెకున్న నిబద్ధతను ఆయన కొనియాడారు. ఎమిలీ సేవలకు, దేశం పట్ల ఆమెకున్న అచంచల నిబద్ధతకు, విధేయతకు నేను ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

“విధి నిర్వహణలో భాగంగా ఆమె ఎంతో ఒత్తిడిని, బెదిరింపులు, వేధింపులను ఎదుర్కొన్నారు. మరోమారు ఆమెకు ఈ పరిస్థితిని ఎదురవడం నేను చూడలేను. అయితే మా పోరాటం మాత్రం కచ్చితంగా కొనసాగుతుంది. అంతిమ విజయం మాదే” అంటూ ప్రకటించారు.

అయితే అమెరికా ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ ప్రక్రియను ప్రారంభించాలని ఎమిలీకి, ఆమె బృందానికి సూచిస్తున్నాను. నా టీంకు కుడా నేను ఇదే సూచన చేశాను. అని ట్రంప్ ట్వీట్ చేశారు.  ఎమిలీ ప్రకటనతో బైడెన్‌ శ్వేతశౌధంలో అడుగు పెట్టడం ఇక లాంఛనమేనని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్, కమలా హారిస్ విజయం సాధించారని జీఎస్ఏ దాదాపు అంగీకరించినట్టేనని బైడెన్ తరఫున అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న యోహాన్నెస్ అబ్రహామ్ ఓ ప్రకటన విదుడల చేశారు. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారానికి ఇది తొలి అడుగు అని, కరోనా కట్టడితో పాటు అర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.