ఆత్మరక్షణలో టీఆర్ఎస్ – ఎంఐఎం బంధం 

టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎం‌కు వేసినట్లేనని   బీజేపీ చేస్తున్న ప్రచారంతో  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  ఆ రెండు పార్టీలు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.  ఈ ప్రచారం ఓటర్లపై తీవ్రంగా పడే ప్రభావం ఉన్నట్లు గ్రహించి రెండు పార్టీలు సరిదిద్దుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. 

రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేకపోయినా, ఒకరిపై ఒకరు పోటీ చేసుకొంటున్న ఎంఐఎం కు బలం ఉన్న డివిజన్ లలో కేవలం హిందువుల ఓట్లు చీల్చడం కోసం టీఆర్ఎస్  బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపడం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే విధంగా చేస్తున్నారు. 

గతంలో కాంగ్రెస్ ఆ విధంగా కాంగ్రెస్ ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందంతో  నడుచుకొంటూ ఉండెడిది. అంతకు ముందెన్నడూ ఇద్దరు, ముగ్గురికి మించి ఎమ్యెల్యేలు లేని ఎంఐఎంకు ఇప్పుడు ఎనిమిది మంది వరకు గెలుపొందుతూ ఉండడం ఈ విధమైన లోపాయికారి కుమ్మక్కు కారణం అన్నది బహిరంగ రహస్యమే.  

టీఆర్ఎస్ అండతోనే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం 44 మంది వరకు కార్పొరేటర్లను గెలిపించుకో గలిగింది. ఇప్పుడు కూడా అదే విధమైన ఎత్తుగడతో రెండు పార్టీలు పోటీ చేస్తుండగా బీజేపీ ప్రచారంతో ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు ఉలిక్కి పడుతున్నారు. తామిద్దరి మధ్య ఎటువంటి లోపాయికారి పొత్తులేదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు 

పైగా, టీఆర్ఎస్ కి ఓటు వేస్తే… మేయర్ పదవి ఎమ్.ఐ. ఎమ్. కి కట్టపెడ్తారని బిజెపి చేస్తున్న ప్రచారం  టీఆర్ఎస్ మద్దతుదారులతో సహితం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ సీటు మాదే..  తలక్రిందులు తపస్సు చేసిన… మేయర్ సీట్ ఎమ్.ఐ. ఎమ్.కి ఇవ్వబోమని  మంత్రి శ్రీనివాస్ గౌడ్    సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. 

టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా చెబుతూ దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకి ఉందని, గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలకు గెలుచుకున్న తమ పార్టీ ఈసారి 52 స్థానాలను కైవసం చేసుకుంటుందని  అంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. 

అయితే టీఆరెస్ – ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్రని కాంగ్రెస్ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయని ఆమె స్పష్టం చేశారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని చెప్పారు. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అని విజయశాంతి తెలిపారు.

మరోవంక, తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని  కూల్చేయగలమని పేర్కొంటూ కేసీఆర్ ప్రభుత్వం తమ దయాదాక్షిణ్యాలపై కొనసాగుతున్నదని స్పష్టమైన సంకేతాన్ని చార్మినార్‌ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్ ఇచ్చారు.

మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అంటూ అధికార పక్ష నేతలను ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే ద కూమీరోచబెట్టడం తెలుసు, గద్దె దించడం తెలుసు అని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవంక, పాతబస్తీలో కేటీఆర్ పాదయాత్ర చేయాలన్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో అనుమతి పాందాల్సిందేనని మాజీ కార్పొరేటర్  ఖాజాబిలాల్  మజ్లిస్ పార్టీలో చేరుతూ స్పష్టం చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కావొచ్చు కానీ పాతబస్తీ ముఖ్యమంత్రి అసదుద్దీన్ ఒవైసీనేనని ఆయన పేర్కొనడం అమానిస్తే ఎంఐఎం అధికార పక్షంపై ఏ విధంగా స్వారీ చేస్తుందో  వెల్లడి అవుతుంది.