అఖండ భారత్ కు ఎన్సీపీ నేత మద్దతు 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ను దేశంలో విలీనం చేసి ఐక్య భారత్‌గా మారిస్తే తాము స్వాగతిస్తామని ఎన్‌సీపీ ( నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ) సీనియర్‌ నాయకుడు,  మహారాష్ట్ర మంత్రి నవాజ్‌ మాలిక్‌  బహిరంగంగా మద్దతు ప్రకటించారు.  

కరాచీని భారత్‌లో కలుపే సమయం ఆనన్నమైందని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావీస్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు.  బెర్లిన్‌ గోడ ధ్వంసం చేసినప్పుడు భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కలిస్తే తప్పేముందని ఆయన  ప్రశ్నించారు. 

మూడు దేశాలను ఏకం చేసి ఐక్య భారతావని నిర్మిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని స్పష్టం చేశారు.  పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ లో విలీనం కావాలని తాము కూడా ఆశిస్తున్నట్లు తెలిపారు. 

క‌రాచీ స్వీట్స్‌, క‌రాచీ బేక‌రీ.. ఈ షాపులు ముంబైలో చాలా ప్రఖ్యాతి పొందాయి.   అయితే ఆ షాపు నుంచి క‌రాచీ పేరును తీసివేయాల‌ని శివ‌సేన నేత నితిన్ నంద‌గోవ్క‌ర్ ఇటీవ‌ల ఆ షాపు యజమానులను బెదిరించారు. పాకిస్థాన్‌లో ఉన్న క‌రాచీ ప‌ట్ట‌ణం పేరును స్వీట్ షాపుకు పెట్ట‌డాన్ని  త‌ప్పుప‌ట్టారు. 

ఆ ఊరు పేరును తీసి మ‌రో పేరును మ‌రాఠీలో పెట్టాలంటూ షాపు ఓన‌ర్ల‌ను నితిన్ వ‌త్తిడి చేశారు.  దానికి సంబంధించి ఓ వీడియో ఇటీవ‌ల వైర‌ల్ కూడా అయ్యింది. ఈ వివాదంపై శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ స్పందిస్తూ  క‌రాచీ ప‌దం తొల‌గింపు త‌మ పార్టీ విధానం కాద‌ని స్పష్టం చేశారు.  

అయితే ఈ వివాదంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత  దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స్పందిస్తూ  ఏదో ఒక రోజు క‌రాచీ మ‌న దేశంలో భాగం అవుతుంద‌ని భరోసా వ్యక్తం చేశారు. క‌రాచీ వివాదాంపై ఓ జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు ఫ‌డ్న‌వీస్ స్పందిస్తూ అఖండ భార‌త్ సిద్ధాంతాన్ని తాము న‌మ్ముతామ‌ని,  ఏదో ఒక రోజు క‌రాచీ ప‌ట్ట‌ణం.. మ‌న దేశంలో భాగంగా మారుతుంద‌ని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు.