కాంగ్రెస్‌ వ్యవస్థ కుప్పకూలింది 

బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ చతికలపడడంతో ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సోనియా గాంధీ కుటుంభంపై పార్టీలో సీనియర్లు అసమ్మతి గళం పెంచుతున్నారు. నాయకత్వ తీరులో మార్పులు రాకపోతే ఇక ఎప్పటికీ కాం‍గ్రెస్‌ పార్టీని విజయవంరించదని అంటూ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన ఆరోపణలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

మరోవంక మరో సీనియర్ నేత పి చిదంబరం సహితం తనదైన శైలిలో పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. తాజాగా వారితో రాజ్యసభలో ప్రతిపక్ష నేత, జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ నబి ఆజాద్ చేశారు. కాంగ్రెస్‌లో 5స్టార్‌ సాంప్రదాయం ఎక్కువగా పెరిగిపోయిందని, నేతలు ప్రజల్లో కన్నా ఏసీ రూముల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని సొంత పార్టీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని ఆజాద్‌ స్పష్టం చేశారు. బిహార్‌ ఎన్నికల తరువాత తొలిసారి స్పందించిన ఆయన పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదని పేర్కొంటూ ప్రస్తుత నాయకత్వంలో పార్టీ ముందడుగు వేయలేదని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. 

 ‘‘పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థలో ఎవరైనా నేత ఎన్నికైతే అది సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యవ స్థ వల్ల లాభం లేదు’’ అని తెల్చిపారవేసారు. 

‘‘నాయకుణ్ణి మార్చేస్తే మనం బిహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీల్లో గెలిచేస్తామనుకుంటే పొరపాటు. వ్యవస్థను మార్చినప్పు డే ఇది సాధ్యం’’ అని తెలిపారు.  ప్రజలకు కాంగ్రెస్‌ నేత లకు మధ్య సంబంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. 

ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటం చేయకుండా కేవలం ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయగానే ఇక తమ పని పూర్తి అయ్యిందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఈ తీరు వెంటనే మార్చుకోవాలి. జాతీయ నాయకత్వం కిందస్థాయి నేతలకు ఆదర్శంగా ఉండాలని అంటూ పార్టీ నాయకత్వానికి చురకలు అంటించారు.