బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళ  

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ తన పాలకవర్గంలోకి మరో భారత సంతతికి చెందిన మహిళను తీసుకున్నారు. కాబోయే మొదటి మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగాను నియమిస్తున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. 
 
జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌ – కమలా ప్రచార బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. గతంలో అడిగా బైడెన్‌ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాలకు డైరెక్టర్‌గా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలోనూ పలు బాధ్యతలు నిర్వర్తించారు. 
 
ఇల్లినాయిస్‌కు చెందిన ఈమె గ్రిన్నెల్‌ కాలేజ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. 2008 ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధికారం చేపట్టిన అనంతరం అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా చేరారు.
 
మాలాతో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లను  బైడెన్‌ ప్రకటించారు. వీరంతా వివిధ వర్గాలకు చెందిన వారని, అమెరికా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
బైడెన్‌ – హారిస్‌ ప్రచార బృందం ఉపాధ్యక్షురాలు అథీరస్సెల్‌ వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. లూయిసా టెర్రెల్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ లెజిస్టేటివ్‌ అపైర్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. కార్లోస్‌ ఎలిజండోను వైట్‌హౌస్‌ సామాజిక కార్యదర్శిగా నియమించారు.