బీహార్ తర్వాత కాంగ్రెస్ కమిటీల్లోకి అసమ్మతి నేతలు 

బీహార్ ఎన్నికలలో పార్టీ చావు దెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనావస్థ దిశగా పయనిస్తోందంటూ పార్టీ సీనియర్ కపిల్ సిబల్ మరోసారి అసమ్మతి గళం వినిపించడంతో మరోసారి పార్టీలో అసమ్మతి రాజుకున్న నేపథ్యంలో పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అసమ్మతి నేతలు నలుగురికి మూడు కమిటీలోస్థానం కల్పించారు. 
 
ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు దేశభద్రతలపై ఏర్పాటు చేసిన ఈ మూడు కమిటీలో ్లమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఢిల్లీ వాయుకాలుష్యంనుంచి తప్పించుకోవడానికి శుక్రవారం గోవాకు వెళ్లడానికి ముందు సోనియా గాంధీ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. 
 
ఓ  పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ సంస్కృతి కొనసాగినంత కాలం పార్టీ దిగజారుతనే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బైటపడేలా చేసిన చేసింది. 
 
పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగాలని, సంస్థాగతంగా ప్రక్షాళన జరగాలంటూగత ఆగస్టులో గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, శశిథరూర్ సహా 23 మంది నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడం తెలిసిందే. అప్పటినుంచి ఈ వ్యవహారంపై పార్టీలో చర్చ జరుగుతూనే ఉంది. 
 
ఈ తిరుగుబాటులను చల్లబరచడం కోసమా అన్నలంటూ సోనియా గాంధీ అసమ్మతి నేతల్లో నలుగురికి ఈ కమిటీల్లో స్థానం కల్పించారు. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీలో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి స్థానం కల్పించగా, విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్ శర్మ, శశిథరూర్‌లకు, దేశ భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీలో గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీలకు చోటు కల్పించారు. 
 
ఆర్థిక వ్యవహారాల కమిటీలో చిదంబరంలో పాటుగా మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్‌లకు కూడా స్థానం కల్పించారు. అలాగే విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీలో సల్మాన్ ఖుర్షీద్, ఒడిశాలోని కోరాపుట్ ఎంపి సప్తగిరి శంఖ ఉలక కూడా ఉన్నారు. 
 
ఇక దేశ భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీలో మేఘాలయ ఎంపి విన్సెంట్ హెచ్ పాలా, పుదుచ్చేరి మాజీ సిఎం వి వైద్యలింగం కూడా ఉన్నారు.