కరోనా దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు లేఖ రాశారు. కరోనా దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యంకాదని అందులో ఆమె పేర్కొన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా కరోనా కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని ఆమె హితవు చెప్పారు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని అందులో ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6890 మంది కరోనా వల్ల మరణించారని ఆమె వెల్లడించారు.
మరోసారి కరోనా ప్రబలేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళనవ్యక్తంచేశారు. అందువల్ల ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఆమె స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సరికాదని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఎన్నికలపై పునరాలోచన చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించిన కొద్దీ సేపటికే ఆమె ఈ లేఖ వ్రాసారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంతకు ముందు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు.
More Stories
జగన్ కు షాక్.. సరస్వతి భూముల స్వాధీనం
సోషల్ మీడియా పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం
అనంతపురం మీదుగా విజయవాడ- బెంగళూరు మధ్య వందే భారత్