
ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అని, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మరో మూడేళ్లు పూర్తి కాగానే ఆ పార్టీని మూసేస్తారని బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు జోస్యం చెప్పారు.
పైగా, తాను కేఏ పాల్‌లా నోటికొచ్చినట్టు మాట్లాడటం లేదని, విశ్లేషించి చెబుతున్నానని కూడా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను ముందే తిరుపతిలో చెప్పానని, అదే జరిగిందని గుర్తు చేశారు. మడమ తిప్పనని, మాట తప్పనని చెప్పిన జగన్ ఏ విషయంలోను దానిని పాటించలేదని ధ్వజమెత్తారు.
ప్రతి పేదకు ఇల్లు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణంపై అసలు దృష్టే పెట్టలేదని దయ్యబట్టారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలంతా…అలా ఎందుకు చేశామా? అని ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన వాపోయారు. ఎక్కడికి వెళ్లినా ఈ విషయం తెలుస్తుందని చెప్పారు.
జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని చెబుతూ పొరపాటున ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని విమర్శించారు. దాంతో మాట్లాడడానికి కూడా అంతా భయపడుతున్నారని చెప్పారు. శని, ఆదివారాల్లో కూడా కోర్టులు పనిచేయాలని తాను న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
శని, ఆదివారాలు వచ్చాయంటే విశాఖపట్నంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. శుక్రవారం రాత్రి మొదలు పెట్టి, ఆదివారం వరకూ భవనాలు కూల్చేస్తూ, ఖాళీ చేయిస్తూ అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి బాధితులకు తగిన న్యాయం వెంటనే జరగాలంటే విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాజు స్పష్టం చేశారు.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు