దీపావళికి ‘మేడ్‌ ఇన్‌ చైనా’కు  ఆదరణ తుస్ 

దేశీయ విపణిలో చైనా ఉత్పత్తులకు ఆదరణ భారీగా తగ్గిపోయింది. ఈసారి దీపావళి అమ్మకాల్లో ‘మేడ్‌ ఇన్‌ చైనా’కు అంతగా డిమాండ్‌ కనిపించలేదని తాజా సర్వేలో స్పష్టమైంది. కేవలం 29 శాతం మందే చైనా వస్తువులను ఈ పండుగ సీజన్‌లో కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌సర్కిల్స్‌ తెలియజేసింది.
గతేడాది సర్వేలో 48 శాతం మంది చైనా ప్రోడక్ట్స్‌ను కొన్నామని చెప్పినట్లు గుర్తుచేసింది. ఈ నెల 10 నుంచి 15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో లోకల్‌సర్కిల్స్‌ సర్వే జరిగింది. ఇందులో 14వేల మందికిపైగా పాల్గొన్నారు. గతంతోపోల్చితే ఈ ఏడాది చైనా ఉత్పత్తులను కొనే భారతీయుల సంఖ్య 40 శాతం పడిపోయిందని లోకల్‌సర్కిల్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌ సచిన్‌ తపారియా ఈ సందర్భంగా ఓ ప్రకటనలోతెలిపారు.
‘ఈ ఏడాది జూన్‌లో గల్వాన్‌ వ్యాలీలో 20 మంది భారత సైనికులను అన్యాయంగా చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నది. ఈ నేపథ్యంలో భారత్‌లో చైనా వ్యతిరేక నినాదం గట్టిగా పాతుకుపోయింది. దాని ఫలితమే ఇది’ అని తపారియా తాజా ట్రెండ్‌ను అభివర్ణించారు. సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వచ్చే ఏడాది కూడా చైనా ఉత్పత్తులను కొనేది లేదని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.
మరోవంక,  దేశంలోని వివిధ నగరాల్లో ఈ దీపావళి అమ్మకాలు రూ.72వేల కోట్లుగా నమోదైనట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తెలియజేసింది. మరోవైపు ఈసారి భారతీయ వ్యాపారులు చైనా వస్తువులను అమ్మబోమని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ దేశ ఎగుమతిదారులకు కనీసం రూ.40వేల కోట్ల నష్టం రావచ్చని సీఏఐటీ ఈ సందర్భంగా అంచనా వేసింది.
కాగా, ఈసారి అమ్మకాల్లో ఎఫ్‌ఎంసీజీ,  బొమ్మలు, ఎలక్ట్రిక్‌-ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫర్నీచర్‌, దుస్తులు, ఫ్యాషన్‌, గృహాలంకరణ వస్తువులకు అధిక డిమాండ్‌ కనిపించినట్లు సీఏఐటీ తెలియజేసింది.