వక్ఫ్ బోర్డు సీఈవో తీరుపై హైకోర్టు ఆగ్రహం

వక్ఫ్ బోర్డు సీఈవో తీరుపై హైకోర్టు ఆగ్రహం
ముస్లిం శ్మశానాలు, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై హైకోర్టు విచారించింది. హైకోర్టు విచారణకు వక్ఫ్ బోర్డు సీఈఓ మహ్మద్ ఖాసిం హాజరైనారు. వక్ఫ్ ఆస్తుల కబ్జాలపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని వక్ఫ్‌బోర్డు సీఈవో కోర్టుకు తెలిపారు. 
 
వక్ఫ్ బోర్డు సీఈవో మహ్మద్ ఖాసిం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 85 ఆస్తులు కబ్జా అయితే కేవలం 8 కేసులే ఎందుకు పెట్టారని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు కేసులు పెట్టకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయస్థానం పేర్కొంది.
 
చట్టాలపై కనీస అవగాహన లేని అసమర్థ అధికారులను సాగనంపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో విఫలమైన సీఈవోపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. 
 
వక్ఫ్ ఆస్తుల కబ్జాపై విచారణ జరిపి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని మైనార్టీశాఖకు ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే మైనార్టీశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.