బీజేపీలోకి మాజీ మేయర్‌‌‌‌ కార్తీక!

దుబ్బాక ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గెలుపొందడంతో జి హెచ్ ఎం సి ఎన్నికలలో అందరు దృష్టి బిజెపిపై పడుతున్నది. అధికార పక్షాన్ని ఓడించడం బీజేపీకే సాధ్యమని పలువురు నేతలు బిజెపి వైపు చూస్తున్నారు. తాజాగా మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండి కార్తీక బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 19న బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. 

పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌‌‌‌ విజయశాంతి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని,  ఆమె ఈ నెల 22 లేదా 23న బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. 

మరోవంక, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌‌‌‌ రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం బీజేపీలో చేరారు.  కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి కొన్ని నెలల క్రితం కార్తీక ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించినా మాట ఇవ్వలేదు. 

గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌‌‌ అసెంబ్లీ టికెట్‌‌‌‌ ఆశించి భంగపడ్డ ఆమె పార్టీలో ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌ రావు రెండు రోజుల క్రితం కార్తీకతో భేటీ అయ్యారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

మరోవంక అధికార టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది. మల్కాజ్‌‌‌‌గిరి, సికింద్రాబాద్‌‌‌‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొందరు అసంతృప్త నేతలు కమలం పార్టీతో టచ్‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం.  టీఆర్‌ఎస్‌ అల్లాపూర్‌ డివిజన్‌ సీనియర్‌ నేత పులిగోళ్ల శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పటికే  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 

ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్‌ కూడా  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.   జీడిమెట్ల డివిజన్‌లోని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు  గార్గే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.