బీహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్ 

బీహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్ 
బిహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ మరోసారి చేపట్టబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు. 
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర ఎన్డీయే పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శాసన సభా పక్ష నేతను ఎన్నుకునేందుకు ఎన్డీయే సమావేశం పాట్నాలోని 1, అన్నే మార్గ్‌లో ఉన్న నితీశ్ కుమార్ అధికారిక నివాసంలో జరిగింది.
ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్  సోమవారం సాయంత్రం నాలుగున్నరకు నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   ఎన్డీయే శాసన సభ్యుల సమావేశానికి ముందు జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నితీశ్ కుమార్‌ను జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

సీఎంగా బీజేపీ అభ్యర్ధి ఉంటే బాగుండేదని, కానీ బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా ప్రమాణం చేయబోతున్నానని ఈ సందర్భంగా నితీష్ కుమార్  చెప్పారు. తనకు మద్దతిస్తున్న ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు.

 తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 

జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.

ఈ కూటమికి 125 స్థానాలు లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కింది. బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 స్థానాలను సాధించాయి. ఈ కూటమిలోకి ఎల్‌జేపీని చేర్చుకుంటారా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

కాగా,  బీహార్ లో బీజేపీ శాసన సభా పక్ష నేతగా తార్‌ కిశోర్‌ను ఎన్నుకున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ మోదీ తార్‌ కిశోర్‌కు ట్విటర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.