పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు  

పాకిస్థాన్ శుక్రవారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారత జవాన్లు, పౌరుల ప్రాణాలను బలిగొనడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. 

విదేశీ వ్యవహారాల శాఖలోని పీఏఐ (పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ డెస్క్) జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాక్ రాయబార కార్యాలయ దౌత్యవేత్త ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేయనున్నట్టు చెబుతున్నారు. తమ కౌన్సిలర్ జవాద్ అలీ త్వరలోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిని కలవనున్నట్టు పాక్ హౌ కమిషన్ తెలిపింది.

పాకిస్థాన్ ఆర్మీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉరి నుంచి గురెజ్ వరకు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు దిగింది.

దాయాది చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ దళాలు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పండుగ రోజున దేశంలో శాంతిని విచ్ఛిన్నం చేసేందుకు హింసకు పాల్పడుతోందని మండిపడింది.

కాగా, శుక్రవారం నాటి పాక్ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా భారత దళాలు జరిపిన ఎదురుదాడిలో 11 మంది పాక్ సైనికులు హతమయ్యారు. 

వీరిలో ఇద్దరు-ముగ్గురు పాకిస్థాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమాండోలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, మరో 16 మంది గాయపడ్డారు.