సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రతి నెలా రూ 10,000 కోట్ల మేరకు లోటు ఏర్పడుతూ ఉండడంతో జీత, భత్యాలకే ప్రభుత్వం కష్ట పడవలసి వస్తున్నది.
రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తీసుకునే రూ 25,000 కోట్ల రుణంలో సింహభాగాన్ని ఈ పథకాలకే ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం ఎపిఎస్‌డిసి ద్వారా రూ 25,000 కోట్ల రుణాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా దీనిని ఎస్క్రో విధానంలో తీసుకోనున్నారు.
ఈ విధానంలో తీసుకున్న రుణాలను ఏ రంగానికి తీసుకుంటారో అదే రంగానికి ఖర్చు చేయాలన్నది నిబంధన ఉంది. ఈ రూ 25,000 కోట్ల రుణంలో కొంత భాగాన్ని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్య, ఆసుపత్రుల్లో మౌలిక వసతులకు ఖర్చు చేయాలని, మిగిలిన నిధులను వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి, వైఎస్‌ఆర్ రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలకు వెచ్చించాలని నిర్ణయించారు.
బ్యాంకులతో చేసుకునే ఒప్పందాల్లో కూడా ఈ పథకాలకు నిర్ధిష్టంగా పొందుపరచనున్నారు. దీనికి సంబంధించి భారతీయ స్టేట్ బ్యాంకును ప్రధాన ఎస్క్రో బ్యాంకుగా గుర్తించాలని నిర్ణయించారు. రుణానికి నేరుగా ప్రభుత్వం గ్యారంటీని ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే ఈ గ్యారంటీలపై బ్యాంకులు కూడా కొన్ని షరతులు పెడుతున్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో గ్యారంటీలు ఇచ్చినా కొన్ని సంస్థలు డిఫాల్టర్లుగా మారిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
ఇందులో ఇప్పటికే రూ 6,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు ఆర్ధికశాఖ అధికారి ఒకరు చెప్పారు. మిగిలిన రూ 19,000 కోట్ల రుణానికి సంబంధించి ఈ నెల్లోనే ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఎపిఎస్‌డిసి కసరత్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
More Stories
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు
అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణంకు ఆమోదం
తిరుపతి తరహాలో శ్రీశైలం అభివృద్ధి