పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మార్చడం కోసం ఒక వంక ప్రయత్నం చేస్తుంటే అక్కడున్న ప్రముఖ వైసిపి నేతలు అంతర్గత కుమ్ములాటలతో రచ్చ రచ్చ చేస్తుండడం పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.
విశాఖలోని ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీతో పాటు పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డిని కూడా తన అధికార నివాసానికి పిలిపించి పంచాయతీ చేశారని తెలిసింది. భూముల వ్యవహారంపై జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిడిఆర్‌సి) సమావేశంలో వైసిపి వ్యవహారాల ఇన్‌చార్జి విజయ సాయి రెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బాహాటంగానే విమర్శలు చేసుకున్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై విజయ సాయి రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేయగా, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విభేదించారు. అదేవిధంగా నాడు-నేడు పనులనుద్దేశించి అమర్‌నాథ్ ప్రతి విమర్శ చేశారు. ఇలా నేతలు బహిరంగంగా రచ్చకెక్కడంతో పాటు ఈ గొడవ ముదిరే అవకాశం ఉండటంతో వీరిని ముఖ్యమంత్రి పిలిపించారు.
విశాఖ వ్యవహారాలపై వారిని జగన్ ఆరా తీశారు. భూముల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఇతర వైసిపి నేతల జోక్యాన్ని సంబంధించి అంశాలను ప్రస్తావించారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలి తప్ప అధికారిక సమావేశాల్లో వాగ్వాదాలకు దిగడం సరైనది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారని చెబుతున్నారు.
ఈ సందర్భంగా తాము పేరుకే ఎమ్మెల్యేలుగా ఉంటున్నామని, తమను అధికారులు లెక్కచేయడం లేదని, కనీసం న్యాయబద్ధమైన పనులు కూడా చేయించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు వాయిపోయినట్లు తెలిసింది. మా పరిస్థితి మీ ముందుకు తీసుకురావడం ఇష్టం లేక విజయసాయి రెడ్డికి చెబుదామనకున్నామని, కానీ ఆయన కూడా తమకు సమయం ఇవ్వడం లేదంటూ గోడు వెలిబుచ్చారు.
కాగా, అధికారంలో ఉన్నామని…అధికారులకు ప్రతి పని చెప్పి ఒత్తిడి చేస్తే పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయని విజరు సాయి రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ భేటీపై వైసీపీ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి. ఎవ్వరు ధ్రువీకరించడం లేదు.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు