సరైన సమయంలో మోదీ, బైడెన్ మాట్లాడుకొంటారు 

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌లు వారికి అనుకూలమైన సమయంలో మాట్లాడుకుంటారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్‌- అమెరికా సంబంధాలు అమెరికాలో ద్వైపాక్షిక మద్దతును పొందుతాయని పునరుద్ఘాటించింది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పై డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలిచిన కొన్ని రోజులకు భారత్‌ ఈ ప్రకటన చేసింది. జో బైడెన్‌ను ట్విట్టర్‌ ద్వారా ప్రధాని మోడీ అభినందించారంటూ, అదేవిధంగా భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని బైడెన్‌ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి శ్రీవాత్సవ  గుర్తు చేశారు . 

భారత్‌- అమెరికా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ సైతం అభిప్రాయాన్ని వ్యక్త పరిచారని ఓ సమావేశంలో శ్రీవాత్సవ తెలిపారు. 

ఇరు దేశాధినేతలు ఎప్పుడు సంభాషించుకుంటారన్న ప్రశ్నకు… వారిద్దరికీ తీరిక దొరికిన సమయంలోనని తెలియజేశారు. అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికాలో ద్వైపాక్షిక మద్దతు ఉందని చెప్పారు.