ప్రాణహాని అంటూ వైసిపి ఎమ్యెల్యే  శ్రీదేవి ఫిర్యాదు 

ఆ ఇద్దరి వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ.. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.  శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారు తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బెదిరిస్తున్నారని ఆమె గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సందీప్‌, సురేష్‌ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని, దీంతో మండల పార్టీ నాయకులు వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె తెలిపారు. ఆ ఇద్దరిపై తానే అధిష్ఠానానికి చెప్పానని భావించి, కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి ఆరోపించారు. 
 
తన గొంతు మార్ఫింగ్‌ చేసి మాట్లాడుతూ, తనను అవమానిస్తున్నారని, తాను బయటకు వెళ్లినప్పుడు వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు, ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపి నందిగం సురేష్‌పై సందీప్‌, సురేష్‌లు రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపి తాడికొండ టిడిపి నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపి, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, భూ కుంభకోణాలు చేస్తున్నారని, దళితుల భూముల్ని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అవినీతిని ప్రశ్నించినందుకు టిడిపి నేతలతో కలిసి వైసిపి కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని, తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వారిద్దరూ పేర్కొన్నారు.