పోలవరంతో తెలంగాణ ముంపుపై అధ్యయనం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ వల్ల తెలంగాణలో ముంపు ప్రభావంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. 

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి  దాఖలు చేసిన ఓ పిటిషన్‌లో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో జరిగిన సమావేశం తాలూకు మినిట్స్‌ తాజాగా విడుదలయ్యాయి. సమావేశంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ అధికారులు పాల్గొని ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బ్యాక్‌ వాటర్‌ ప్రభావం అధ్యయనానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సహకరించాలని, అందుకుగాను ఈ నెల 15లోపు పూర్తి వివరాలు సమర్పించాలని నిర్ణయించారు. అధ్యయనాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా నివేదిక సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

అధ్యయనానికి అయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో బ్యాక్‌ వాటర్‌పై ఐఐటీ హైదరాబాద్‌తో చేయించిన అధ్యయన నివేదికను  ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15లోగా కేంద్ర జలసంఘం, పీపీఏ, ఏపీ ప్రభుత్వానికి అందించాలని, దాన్ని పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 15లోగా సీడబ్ల్యూసీ అభిప్రాయాలు చెప్పాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాలపై ప్రతికూల ప్రభావం పడితే గనక అందుకు పూర్తి బాధ్యత వహించడానికి ఏపీ ప్రభుత్వం, పీపీఏ సూత్రపాయంత్రంగా అంగీకరించాయి.

అయితే, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాలో రక్షణ ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించడానికి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలనే అంగీకారం కుదిరింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారాన్ని అందించే ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం కూడా సంయుక్త కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. సమావేశంలో పాల్గొన్న ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దశల వారీగా అవి కొనసాగుతున్నాయని తెలిపారు.

అయితే, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం 6 నెలల్లో పూర్తి చేయడానికి భారీ ఆర్థిక వనరులు అవసరమని స్పష్టం చేశారు. నిధుల లభ్యతకు లోబడి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కానీ 6 నెలలు చాలా తక్కువనని, మరింత సమయం కావాలని ఎన్జీటీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు.