బీజేపీకి మేయర్‌ పీఠం కట్టబెడితే ‘డబుల్‌’ ఇళ్లు

రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్‌ పీఠం కట్టబెడితే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి  హామీ ఇచ్చారు. 

ఐదేళ్లక్రితం మున్సిపల్‌ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 

శనివారం రాత్రి హఫిజ్‌పేటలో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ గ్రేటర్‌ ఎన్నికల సన్నాహాక సమావేషంలో జాతీయ ఓబీసీ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ  గ్రేటర్‌ పరిఽధిలో 18లక్షల మంది డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మరో 18లక్షలమంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదలకు ‘మీరు ఎన్నిఇళ్లు కట్టిస్తే అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. ఇటీవలభారీ వర్షానికి రోడ్లు, బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు మునిగిపోయాయని విచారం వ్యక్తం చేశారు. అందులో పేదల బట్టలు, వస్తువులు తడిసి నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రతి కుటుంబం రూ.40వేల నుంచి 50వేల వరకు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు చెల్లించడం విడ్డూరంగా ఉందని దయ్యబట్టారు. రూ.10వేల ఆర్థిక సాయం డబ్బుల్లో కొంత టీఆర్‌ఎస్‌ నాయకులు కమిషన్ల రూపంలో జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. 

గ్రేటర్‌ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా, రాష్ట్రంలో మార్పు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీకి ఓటు వేయాలని జాతీయ ఓబీసీ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ పిలుపు నిచ్చారు. కాళేశ్వరంలో నీరు వచ్చాయో లేదోకానీ  గ్రేటర్‌ మాత్రం వరద, డ్రైనేజీ నీరు ప్రతి ఇంటిలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు. 

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులు మాయమయ్యాయని ధ్వజమెత్తారు.