9న సెషన్స్ కోర్ట్ లో అర్ణబ్ కేసు విచారణ 

ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామిపై వేసిన పోలీసు రివిజన్ పిటిషన్‌‌‌పై నవంబర్ 9న విచారణ జరపాలని రాయగఢ్ జిల్లా అలీబాగ్ సెషన్స్ కోర్టు నిర్ణయించింది. 

పోలీసు కస్టడీకి బదులు జ్యుడిషియల్ కస్టడీకి అర్నబ్‌ను అప్పగిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును పోలీసులు రివిజన్ పిటిషన్‌లో సవాలు చేశారు. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసి, ముగ్గురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్‌లో కోరారు. 

 అర్నబ్ గోస్వామితో పాటు, ఈ కేసులో నిందితులైన ఫిరోజ్ షేక్, నితీష్ సర్దాలు తమ అరెస్టు అక్రమమని, తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముంబై హైకోర్టును అశ్రయించారు. దీనిపై ముంబై హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో పోలీస్ రివిజన్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 9న జరపాలని అలీబాగ్ సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుంది.

దీనికి ముందు, 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణపై గత బుధవారం ఉదయం ముంబైలోని లోయర్ పరేల్ నివాసంలో అర్నబ్‌ను పోలీసులు అరస్టు చేశారు. అనంతరం అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అక్కడి నుంచి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు సునైనా పింగ్లే ముందు హాజరుపరిచారు.

అదే రోజు రాత్రి ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి పంపడానికి మేజిస్ట్రేట్ నిరాకరిస్తూ, నవంబర్ 18 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశాలిచ్చారు. అర్నాబ్‌ను ప్రశ్నించేందుకు 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని అలీబాగ్ పోలీసులు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్నాబ్‌ను ప్రస్తుతం అలీబాగ్‌లోని ఓ పాఠశాలలో ఉంచారు.


కాగా,మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీదే పైచేయి అని తెలుస్తుంది. బీజేపీ 16 నుంచి 18 సీట్లు గెలుచుకుంటుందని పలు సర్వేలు అంచనా వేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లతో స్థిరపడాల్సి ఉంటుందని తెలిపాయి.