హథ్రాస్ కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ సామూహిక అత్యాచార ఘటనలో సిబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. హథ్రాస్‌ మాజీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విక్రాంత్‌ విర్‌, సబ్‌డివిజనల్‌ రిజిస్ట్రార్‌ పిపి.మీనాలను విచారించనున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. 
 
సెప్టెంబర్‌ 30 అర్థరాత్రి బాధితురాలి మృతదేహాన్ని దహనం చేసిన సమయంలో హథ్రాస్‌ ఎస్‌పి వీర్‌ అక్కడే ఉన్నారు. అర్థరాత్రి ఖననం చేయడంపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ యుపి ప్రభుత్వం అక్టోబర్‌ 1న ఆయనను  సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 
మృతదేహాన్ని దహనం చేయడంతో పాటు నిందితులకు అనుకూలంగా వ్యవహరించడంపై వీర్‌ను విచారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పోలీసులు మొదట ఈ కేసులో హత్యాయత్నం అంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
విమర్శలు వెల్లువెత్తిన అనంతరం అత్యాచారం, హత్య సెక్షన్‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అలాగే బాధితురాలి కుటుంబం మీడియాను కలవకుండా సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్‌డిఎం) పిపి.మీనా ఆంక్షలు విధించడంపై కూడా విచారించనుంది. 
 
కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు ఆరుగురు పోలీస్‌ అధికారుల వాంగ్మూలాలను రికార్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు, వారి కుటుంబసభ్యులను కూడా సిబిఐ విచారించింది.