ప్రభుత్వ రంగ బ్యాంకులేవీ ఇటీవలి కాలంలో చార్జీలను పెంచలేదని, సమీప భవిష్యత్తులో ఈ చార్జీలను పెంచాలన్న ఆలోచన కూడా పీఎస్‌బీలకు లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఉచిత నగదు డిపాజిట్ లావాదేవీలకు సంబంధించి నెలవారీ పరిమితి నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులను ఉపసంహరించుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ ఉచిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణల సంఖ్యను బీవోబీ ఐదు నుంచి మూడుకు కుదించిందని తెలిపింది.
ఈ మార్పులు ఈ నెల 1 నుంచ అమల్లోకి వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొన్నది. ఈ పరిమితి దాటిన తర్వాత జరిపే అదనపు లావాదేవీలకు కస్టమర్ల నుంచి వసూలుచేసే సర్వీసు చార్జీల్లో బీవోబీ ఎలాంటి మార్పులు చేయలేదని వివరించింది.
‘కరోనా సంక్షోభంతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిబంధనల్లో మార్పులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు బీవోబీ తెలిపింది. ప్రభుత్వ రంగంలోని మరే ఇతర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో సర్వీసు చార్జీలను పెంచలేదు’ అని ఆర్థిక శాఖ పేర్కొన్నది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అన్ని బ్యాంకులు తమ ఖర్చులను బట్టి పారదర్శక రీతిలో సర్వీసు చార్జీలు విధించేందుకు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు వీలు కల్పిస్తున్నాయని, అయినప్పటికీ సమీప భవిష్యత్తులో సర్వీసు చార్జీలను పెంచాలన్న ఆలోచన తమకు లేదని పీఎస్‌బీలు తెలియజేశాయని వివరించింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న 60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలతోపాటు 41.13 కోట్ల జన్‌ధన్ ఖాతాలకు సర్వీసు చార్జీ వర్తించబోదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
More Stories
రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్
సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే
భారత్ స్వయంగా అనేక ‘సింగ్పూర్’లను సృష్టిస్తోంది