దుబ్బాకలో భారీగా ఓటింగ్‌.. 10న కౌంటింగ్‌

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 82.61 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 2018 ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో 86.24 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌తంలో పోలిస్తే ఈసారి 3.63 శాతం పోలింగ్ త‌గ్గింది. 
మొత్తం 23 మంది అభ్య‌ర్థులు ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. వీరి భ‌విత‌వ్యాన్ని ఓట‌ర్లు ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. అయితే పోటీ ప్రధానంగా టి ఆర్ ఎస్, బిజెపి అభ్యర్థుల మధ్యనే ఉంది. ఈ నెల 10న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. 
 
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కరోనా రోగులకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక అంటే దాదాపు అధికారపార్టీనే ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. అయితే ఆ స్థానానికి కొన్ని సంస్థలు నిర్వహించిన కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం భిన్నంగా అంచానా వేశాయి.
 
 థర్డ్‌ విజిన్‌ రీసెర్చ్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత తొలి స్థానంలోనూ.. 33-36 శాతం ఓట్లతో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రెండోస్థానంలోనూ, 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మూడోస్థానంలోనూ నిలుస్తారని అభిప్రాయపడింది. 
 
ఇక పొలిటికల్‌ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 47 శాతం ఓట్లతో బిజెపికి మొదటిస్థానం రాగా.. 38 శాతం ఓట్లతో టిఆర్‌ఎస్‌, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ తరువాతి స్థానాల్లో నిలుస్తాయని పేర్కొంది.