దుబ్బాక ప్రజలు బీజేపీకే ఓటేశారు 

టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకున్నా దుబ్బాక ప్రజలు మాత్రం బీజేపీకే ఓటు వేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు.  ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ రాత్రికి రాత్రే ఓటుకు రూ.10వేలకు పైగానే పంచారన్నార, కోట్ల రూపాయలు గుమ్మరించారని ఆరోపిస్తూ,  ఫలితం మాత్రం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 
 
 ‘దుబ్బాక నుంచి నాయకులు ,కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టాలనే 81 శాతం ఓటింగ్ పొలైంది. దుబ్బాక లో బీజేపీ విజయం సాధించబోతుంది’  అంటూ సంజయ్ తెలిపారు.
ఇన్ని రోజులు అవస్తవాలను వాస్తవాలుగా చిత్రికరిస్తూ టీఆర్‌ఎస్ అబద్ధాలు చెప్తూ వచ్చిందని పేర్కొంటూ టీఆర్‌ఎస్ పార్టీ పై ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఓటర్లు ఆలోచించారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా బీజేపీకి కలిసి వస్తుందని వివరించారు.   
 
బీజేపీపై విశ్వాసంతో దుబ్బాక ప్రజలు ఓటు వేశారని చెబుతూ అదే నమ్మకంతో పని చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.  నియోజకవర్గ ప్రజలు  అందరికి ధన్యవాదాలు తెలిపారు.  టీఆర్ఎస్ తీరును ఈ ఎన్నికనే తీర్పు చెబుతుందని స్పష్టం చేశారు. సమస్యలను గుర్తించే వ్యక్తి కావాలనే రఘునందన్ ను ఎంపిక చేశామని తెలిపారు.
 
ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే  కనీసం ఎక్కరినీ కూడా స్మరించుకోకుండా బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేస్తే వాడు వీడు అంటూ టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడటం సిగ్గు చేటని సంజయ్ ధ్వజమెత్తారు. 
 
కోవిడ్ పేరుతో వచ్చిన విరాళాల డబ్బులు ఏం చేశారని కేసీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అవి కూడా చాలా మందికి అందలేదని,  టీఆర్ఎస్ కార్యకర్తలు కక్కుర్తితో రూ.10 వేలకు కూడా కమీషన్ తీసుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.