ధరణి పోర్టల్‌లో నమోదుపై హైకోర్టు స్టే

ధరణిలో వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

కొత్త రెవెన్యూ చట్టంలో.. వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని నిలదీసింది. కొత్త రెవెన్యూ చట్టంలో డేటా భద్రతకు సంబంధించిన ప్రస్తావనే లేదని పేర్కొంటూ  డేటా దుర్వినియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందని చెప్పింది. 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయని హైకోర్టు తెలిపింది. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది  

చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్ట్ ఆదేశించింది. డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అడ్వకేట్ జనరల్  కౌంటర్ దాఖలుకు రెండువారాలు గడువు కోరారు. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా హైకోర్టు  వేసింది.