జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌ 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఈ-ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, వృద్ధులు, కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న వారికి ఈ-ఓటింగ్‌ విధానంలో ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. 

ఈ-ఓటింగ్‌ విధానంపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధికారులు చర్చించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ఇబ్బందిగా మారుతోంది. 

పలువురు నడువలేని స్థితిలో ఉంటుండగా.. కుటుంబ సభ్యులు వాహనాలలో తీసుకురావడం, ఎత్తుకొని రావడం కష్టంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ సోకిన, వారు కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉంటున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటింగ్‌ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. వృద్ధులతో పాటు క్వారంటైన్‌లో ఉన్న వారంతా తాము ఉన్న ప్రాంతం నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వీలు కలుగనుంది. 

అలాగే పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది కోసం ప్రస్తుతం ముందస్తుగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ ఓటింగ్‌ విధానం అమలులోకి వస్తే ఓటింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.