చైనా వస్తువులు మనకొద్దు

డా. ఎన్ లింగమూర్తి 
అర్ధశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, 
సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కర్ణాటక 

ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు బార్డర్​లో చైనా దురాక్రమణలు మనదేశ ఆర్థిక సార్వభౌమత్వంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి. మన పొరుగున ఉన్న మిత్ర దేశాలన్నింటినీ మనకు శత్రువులుగా మార్చడంలో చైనా విజయం సాధించిందనే చెప్పాలి. దీని ద్వారా ఇండియాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. గత 30 ఏండ్లలో వరల్డ్​ ట్రైడ్​ ఆర్గనైజేషన్​(డబ్ల్యూటీవో) రూల్స్​ను ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో ఆర్థికంగా సంపాదించడమే ప్రస్తుతం చైనా దూకుడుకు కారణం.

ఇండియా డబ్ల్యూటీవో రూల్స్​ను పాటించడం వల్లే వాణిజ్య లోటుకు గురవుతోంది. అయితే తాజాగా ఎదురైన పరిస్థితులు, బార్డర్​కు సంబంధించి తీవ్రమైన బెదిరింపులకు చైనా దిగడంతో ఆ దేశానికి చెందిన వందకుపైగా యాప్​లను నిషేధించడం ద్వారా మన ప్రభుత్వం మంచి చర్యలే తీసుకుందని చెప్పాలి. ఏదేమైనా, ప్రభుత్వ ఆంక్షలు మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వలేవు. ప్రతి వ్యక్తి కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి.

డంపింగ్​ చేయడంలో డ్రాగనే ముందు

ప్రపంచంలో ఆర్థిక, రక్షణ శక్తిగా చైనా మారగలదని పలు ఇంటర్నేషనల్, ఇండియన్​ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు ఇండియా గవర్నమెంట్​ను హెచ్చరిస్తూ వచ్చాయి. చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రధానంగా మన దేశంలో మొదటి నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులతోనే ముడిపడి ఉంది. దీని ప్రభావం ఇండియన్​ ఇండస్ట్రీలపై పడింది. ముఖ్యంగా ఈ పరిశ్రమల్లో యూనిట్ పెట్టుబడికి ఉపాధిని అందించే సామర్థ్యం ఎక్కువగా ఉండేది. మన ఇండస్ట్రీలపై చైనా వస్తువుల ప్రభావంపై 2018లో పార్లమెంటరీ కమిటీ  నివేదిక ఇచ్చింది.

చైనా వస్తువులను డంపింగ్, వాల్యుయేషన్​​ చేయడం, స్మగ్లింగ్​ ద్వారా మన దేశానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ రిపోర్ట్​ తేల్చింది. డంపింగ్​కు సంబంధించిన లెక్కలను చూస్తే ఈ విషయంలో చైనా ఆరితేరిందనే చెప్పాలి. 1994 నుంచి 2017 మధ్య డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్​ యాంటీ డంపింగ్, అలైడ్​ డ్యూటీస్​(డీజీఏడీ) చేసిన సర్వేలో యాంటీ డంపింగ్​ ఉత్పత్తుల్లో 57 శాతం చైనాకు చెందినవని తేలింది. డంపింగ్​ కేసు కన్ఫర్మ్​ అయిన ఉత్పత్తులపై కంపల్సరీ యాంటీ డంపింగ్​ సుంకం విధిస్తారు.

2018 వరకు కంపల్సరీ యాంటీ డంపింగ్​ సుంకం విధించిన ఉత్పత్తుల్లో 71 శాతం చైనావే అని తేలింది. ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శకత లేని న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ లేకపోవడం వల్లే చైనా అక్రమ పద్ధతులకు గ్రీన్​సిగ్నల్​ లభించినట్లయ్యింది. అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను వాడుకుని ఇండియన్​ మార్కెట్‌‌ను అక్రమ ఉత్పత్తులతో చైనా నింపేస్తోందని కమిటీ పేర్కొంది.

2016–17లో 1,300 వరకు స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. తద్వారా స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా వస్తువుల విలువ రూ.1,024 కోట్లు. అధికారికంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువే ఇంత ఉంటే, మనదేశం చైనాతో 3,500 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంది. వాటి ద్వారా ఇప్పటివరకు చైనా అక్రమ రవాణా చేసిన వస్తువుల విలువను మనం ఊహించుకోవచ్చు.

ఫార్మాకు కూడా చైనానే దిక్కు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఫార్మా ఇండస్ట్రీనే. ఇటువంటి సమయంలో కూడా ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింది. ఔషధాల ఎగుమతుల్లో మనదేశం అతిపెద్ద దేశాల్లో ఒకటి అయినప్పటికీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్(ఏపీఐలు), కీ స్టాండింగ్ మెటీరియల్స్(కేఎస్ఎం), ఇంకా చాలా ముడి పదార్థాల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. ప్రాణాలను కాపాడే ఔషధాల విషయంలో మనం చైనాపై 90% వరకు ఆధారపడుతున్నాం.

అవసర ఔషధాలకు సంబంధించిన నేషనల్​ లిస్ట్​ను రూపొందించడానికి వాడే ఏపీఏల విషయంలో ఇది 75% వరకు ఉంటుంది. చౌకైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునే మన ధోరణే చివరికి ఏపీఐలను ఉత్పత్తి చేసే దేశీయ కంపెనీల సామర్థ్యాన్ని నాశనం చేసింది. మనం చైనాపై ఆధారపడటంతో చైనా 2016–18లో ఏపీఐల ధరలను 1,200 శాతానికి పెంచింది.

ఇది మన ఎగుమతులను ప్రభావితం చేసింది. కరోనా ఉధృతి పెరగడంతో లాక్​డౌన్​ విధించడం వల్ల రవాణా సేవలు నిలిచిపోవడంతో అన్ని దిగుమతులు, ఎగుమతులు ప్రభావితమైనప్పుడు, మెడిసిన్స్​ను మనదేశంలోనే ఉత్పత్తి చేయడం కష్టమనే భావన ఏర్పడింది.

ఎంఎస్ఎంఈలపైనే ఎక్కువ ఎఫెక్ట్

చైనా డంపింగ్, స్మగ్లింగ్​ ప్రభావం శ్రమతో కూడిన ఎంఎస్ఎంఈలపైనే ఎక్కువగా పడింది. క్లాత్, సోలార్ ప్యానెల్, టాయ్స్, ఫైర్‌‌క్రాకర్, సైకిల్ మొదలైన వాటిపై ఎక్కువ ఎఫెక్ట్​ పడింది. క్లాత్​ ఇండస్ట్రీకి సంబంధించి చైనా దిగుమతుల ఫలితంగా సూరత్, భివాండిల్లో 35% కరెంట్ మగ్గాలు మూసివేశారు. చైనా సోలార్ ప్యానెల్స్​ను డంపింగ్ చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు దాదాపు 2 లక్షల ఉద్యోగాలను కోల్పోయాయని మరో అంచనా.

సైకిల్స్ విషయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు ఇండియానే అయినప్పటికీ, చైనా సైకిళ్ల దిగుమతులు వేగంగా పెరిగాయి. మనదేశం దిగుమతి చేసుకునే సైకిళ్లలో చైనా దాదాపు 2/3 వాటాను కలిగి ఉంది. బొమ్మల తయారీ పరిశ్రమల విషయంలోనూ చైనా ఉత్పత్తులు 85–90% ఉన్నది. అందువల్ల టాయ్స్​ మార్కెట్​లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఫైర్‌‌క్రాకర్ పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

ఇది ఎప్పటి నుంచో పన్నుతున్న కుట్ర

ఇండియన్​ ఇండస్ట్రీలను నాశనం చేయడం ద్వారా చైనా ఆర్థిక శక్తిగా మారింది. మరోవైపు, సరిహద్దులో కూడా తన శక్తిని చూపిస్తోంది. ఇది అకస్మాత్తుగా జరగలేదు. ఇది చైనా ఎప్పటి నుంచో పన్నుతున్న కుట్ర. దీనికి సంబంధించి అనేక మంది రాజకీయ, రక్షణ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.

చైనా బెదిరింపుల గురించి తెలిసినప్పటికీ, మునుపటి ప్రభుత్వాలు పరిస్థితిని ఎదుర్కోవటానికి సరైన అంచనాలతో లేవు. వారి ప్రయత్నమంతా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కాకుండా వారి ప్రభుత్వాలను కాపాడటం కోసమే సాగింది. మన దేశ పరిశ్రమలు సరైన అంచనాలు లేనందున చైనా సంస్థలతో పోటీ పడలేవని అనేక ఎన్జీవోలు, ఎక్స్​పర్ట్స్  హెచ్చరించారు.

చైనా సంస్థలకు వారి ప్రభుత్వ అండ ఉంది. కానీ, ఇండియన్​ కంపెనీలు బ్యూరోక్రాట్లకు డబ్బులిచ్చి తమ వ్యాపారాన్ని సజావుగా నడుపుకుంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అది మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే ఇప్పుడు చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలనే డిమాండ్​తెరపైకి వచ్చింది.

(వి6 వెలుగు ఓపెన్ పేజీ నుండి)