బాలీవుడ్ బిగ్ బీ, ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ వ్యాఖ్యాత అమితాబచ్చన్‌పై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ లాతూర్ ఎస్పీ నిఖిల్ పింగళేకు ఫిర్యాదు చేశారు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ఆయన నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 12’లో హిందువుల మనోభావాలను కించపరిచేలా ఓ ప్రశ్న అడిగారని ఫిర్యాదులో ఆయన ఆరోపించారు.
అమితాబ్‌తోపాటు ఆ షో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువులు, బౌద్ధులు ఎంతో సామరస్యంగా కలసిమెలసి జీవిస్తున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన రెండు పేజీల ఫిర్యాదు ప్రతిని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
శుక్రవారం ప్రసారమైన ‘కరమ్‌వీర్ స్పెషల్’ ఎపిసోడ్‌లో సామాజికవేత్త బెజ్వాడ విల్సన్, నటుడు అనూప్ సోని పాల్గొన్నారు. హాట్‌సీట్‌లో కూర్చున్న వీరిని రూ 6.40 లక్షల ప్రశ్నగా అమితాబ్.. ‘25 డిసెంబరు 1927న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన మద్దతుదారులు ఏ గ్రంథం ప్రతులను తగలబెట్టారు?’ అని ప్రశ్నించారు.
ఆప్షన్లుగా (ఎ) విష్ణు పురాణం (బి) భగవద్గీత (సి) రుగ్వేదం (డి) మనుస్మృతి అని నాలుగింటిని పేర్కొన్నారు. ఇవి నాలుగూ హిందూ మతానికి చెందినవేనని. ఈ ప్రశ్న వెనక హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంటే హిందూ గ్రంథాలను తగలబెట్టవచ్చన్న భావాన్ని ఈ ప్రశ్న ద్వారా వ్యాప్తి చేస్తున్నారని, అంతేకాక, హిందువులు, బౌద్ధుల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఈ ప్రశ్న ఉందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అభిమన్యు పవార్ అత్యంత సన్నిహితుడు.
కాగా, ఈ ఎపిసోడ్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కేబీసీ’ షోపై వామపక్ష భావజాల ప్రభావం ఉన్నట్టు కనిపిస్తోందని కొందరు మండిపడ్డారు. కొందరు మాత్రం ఇది హిందువుల మనోభావాలపై దాడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’