బెంగాల్ లో కార్యకర్తల హత్యలపై భగ్గుమన్న బీజేపీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వరుస హత్యలపై ఆ పార్టీ భగ్గుమంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు ‘థానా ఘెరావ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

రాజధాని కోల్‌కతా నగరంలోని సిలిగురి పోలీస్ స్టేషన్‌ ముట్టడించడానికి అనేక మంది బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది.

వందల మంది కార్యకర్తలు బీజేపీ జెండాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉన్న ఫ్లకార్డులు, బ్యానర్లతో నిరసనగా పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారు.

‘‘భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతోంది. అందుకే మా పార్టీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి” అంటూ బిజెపి నేతలు మండిపడ్డారు. 

బెంగాల్‌లో బీజేపీ ఎంతగా బలపడితే పార్టీ కార్యకర్తలపై దాడులు అంతలా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.  అధికార పార్టీ చేస్తున్న ఈ ఆకృత్యాలను అడ్డుకోవడానికే ‘థానా ఘెరావ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.