తమిళనాడులో బిజెపికి రజనీకాంత్ మద్దతు!

అనారోగ్యం కారణంగా వచ్చే ఏడాది మొదట్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ప్రకటించిన విధంగా తమిళ సూపర్‌స్టార్‌  రాజకీయ ప్రవేశం చేసే అవకాశాలు లేకపోయినా, ఈ ఎన్నికలలో జాతీయ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి గతంలో రజనీకాంత్‌ పలుమార్లు మద్దతు ప్రకటించారని, బీజేపీ పరిపాలనను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్ని కల్లోగా రజనీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని, ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తుపెట్టు కోవాలని బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకుంది.
ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖలో సినీ రంగ ప్రముఖుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వెట్రివేల్‌ పేరుతో ప్రచార యాత్ర కూడా చేస్తోంది. రజనీ వృద్ధాప్య సమస్యలు, కరోనా వైరస్‌ కారణంగా పార్టీని ప్రారంభించే ఆలోచన విరమించు కుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే.
 
 అయితే రజనీ ఆధ్యాత్మికభావాలు కలిగిన వ్యక్తి కావటంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే తమ పార్టీ నాయకులంతా కోరుకుంటున్నారని, పార్టీ పెట్టాలా వద్దా అని నిర్ణయం తీసు కోవాల్సింది ఆయనేనని రవి చెప్పారు. 
 
బీజేపీ ఆశయాలు, లక్ష్యాలకు రజనీ పలుమార్లు బహిరంగంగా మద్దతు కూడా ప్రకటించారని తెలిపారు.  దేశాభివృద్ధి కోసం రజనీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రజనీ తప్పకుండా బీజేపీకి మాత్రమే మద్దుతు ప్రకటించే అవకాశం ఉందని సీటీ రవి చెప్పారు.