డార్జిలింగ్ కు కూడా రాజ్యాంగబద్ధ పరిష్కారం

దేశంలోని కీలమైన 370 అధికరణ, రామ మందిర నిర్మాణం అంశాలు పరిష్కారమైన రీతిలోనే ఉత్తర బెంగాల్ చిరకాల సమస్యలు కూడా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం కావాల్సి ఉంటుందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్ సూచించారు. 
 
ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ హిల్స్‌లో  ప్రత్యేక గూర్ఖాలండ్ డిమాండ్ తో పాటు పలు రాజకీయ సమస్యలు నెలకొనడం తెలిసిందే. శనివారం సిలిగురి చేరుకున్న గవర్నర్ ధన్‌కర్ డార్జిలింగ్ రాజ్‌భవన్‌లో ఆయన నెల రోజుల పాటు విడిది చేస్తారు.
పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను రాజ్‌భవన్‌లో ఆయన కలుసుకుంటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజాసేవకులుగా ఉండాల్సిన ప్రభుత్వాధికారులు రాజకీయ సేవకులుగా పనిచేస్తున్నారని విమర్శించారు.
 
 ”రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ వారం రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అత్యాచార ఘటనల సంఖ్య పెరుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లోనే జనం బాంబులు తయారు చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వీటికి తోడు పలు మార్లు పిలిచినా (రాజ్‌భవన్ నుంచి) డీజీపి (తనను కలవడానికి) రావడం లేదని  విచారం వ్యక్తం చేశారు.  ప్రభుత్వాధికారులు రాజకీయ సర్వెంట్ల తరహాలో పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై మాట్లాడుతూ, అభివృద్ధికి ఇవి రెండు చక్రాలని, ప్రజా శ్రేయస్సు కోసం రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.