భారతీయ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ గుర్తింపు

గోవాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో పరిశోధక విద్యార్థిగా ఉన్న ప్రీతి జగదేవ్‌ అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. 2021 సంవత్సరానికి గానూ ఆప్టిక్స్‌ రంగంలో పరిశోధనలు చేస్తున్న అత్యుత్తమ 25 మంది మహిళా శాస్త్రవేత్తల్లో ఒకరుగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ ఆప్టిక్స్‌ అండ్‌ ఫొటోనిక్స్‌’ జాబితాలో స్థానం సంపాదించారు. 
 
 ఈ  ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయురాలుగా ప్రీతి ఘనత సాధించారు. ప్రీతికి కేంద్ర విద్యామంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇది ఎన్‌ఐటీ, గోవాకు లభించిన మరో అంతర్జాతీయ గుర్తింపు అని ఆ విద్యాసంస్థ డైరెక్టర్‌ గోపాల్‌ ముగరేయ పేర్కొన్నారు. 
 
ప్రీతి జగదేవ్‌ ప్రస్తుతం గోవా ఎన్‌ఐటీలో ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌’లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్నారు. కృత్రిమ మేథ, ఇన్‌ఫ్రారెడ్‌ థర్మోగ్రఫీ సాంకేతికత సహాయంతో మానవుల్లో ఆరోగ్య పర్యవేక్షణ విధానాలపై డాక్టర్‌ లలత్‌ ఇందు గిరి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు.