పతంజలి కొరోనిల్‌‌కు భలే గిరాకీ 

పతంజలి కొరోనిల్‌‌కు భలే గిరాకీ 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే మందులకు డిమాండ్ బాగా పెరిగింది. చ్యవన్‌‌ప్రాశ్ లాంటి ఉత్పత్తులు మార్కెట్‌‌లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు వ్యాధినిరోధక శక్తిని పెంచే ఉత్పత్తుల‌‌ తయారీ దిశగా దృష్టి సారించాయి. 

ఈ నేపథ్యంలో కరోనా మందు అంటూ ప్రముఖ దేశీ కంపెనీ పతంజలి ఆయుర్వేదిక్ ఓ ఉత్పత్తిని  తీసుకొచ్చింది. కొరోనిల్ కిట్ పేరుతో లాంచ్ చేసిన ఈ ప్రొడక్ట్‌‌కు మార్కెట్‌‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ కిట్‌‌ను విడుదల చేసిన నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.250 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 18 నుంచి పతంజలి ఆయుర్వేద సంస్థ సుమారు 2.5 మిలియన్ కొరోనిల్ కిట్స్‌‌ను అమ్మింది.

ఆన్‌‌లైన్‌‌తోపాటు డైరెక్ట్ మార్కెంటింగ్, జనరల్ మార్కెటింగ్, దేశంలోని పతంజలి డిస్పెన్సరీలు, మెడికల్ సెంటర్లలో 25 లక్షల కొరోనిల్ కిట్లను పతంజలి కంపెనీ విక్రయించింది. జూన్ 23న కొరోనిల్‌‌ కిట్‌‌ను కరోనాను తగ్గించే ఔషధంగా పతంజలి విడుదల చేసింది. అయితే ఇది టెస్టుల ద్వారా నిరూపితం కాలేదు. 

దీంతో కొరోనిల్‌‌ను కరోనా వ్యాక్సిన్‌‌గా ప్రచారం చేయొద్దంటూ ట్రయల్స్‌‌తోపాటు అడ్వర్టయిజ్‌‌మెంట్స్‌‌పై ఆయుష్ శాఖ నిషేధం  విధించింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్‌‌గా కొరోనిల్‌‌ను అమ్ముకోవచ్చునని సూచించింది. పతంజలి కొరోనిల్‌‌ను ఓ ఉత్పత్తిగా మాత్రమే విక్రయించుకోవచ్చునని, కరోనా వ్యాక్సిన్‌‌గా కాదని కేంద్రం కూడా స్పష్టత ఇచ్చింది.