4న మ‌రో మూడు రాఫేల్స్‌ రాక‌

ఫ్రాన్స్ నుంచి మ‌రో మూడు రాఫేల్‌ యుద్ధ విమానాలు ఈనెల 4వ తేదీన భార‌త్ రానున్నాయి.  ఫ్రాన్స్ నుంచి 36 రాఫేల్ యుద్ధ విమానాల‌ను భార‌త్ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఇప్ప‌టికే అయిదు యుద్ధ విమానాలు అంబాల ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి.  
 
ఈనెల 4వ తేదీన మూడు రాఫేల్ విమానాలు ఫ్రాన్స్‌లోని ఇస్‌ట్రెస్ నుంచి భార‌త్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు రానున్నాయి.  సుమారు 8 గంట‌ల పాటు నాన్ స్టాప్‌గా యుద్ధ విమానాలు ప్ర‌యాణించ‌నున్నాయి.  రాఫేల్ విమానాల‌కు ఫ్రాన్స్ వాయుసేన‌కు చెందిన విమానం ఇంధ‌నం నింప‌నున్న‌ది. 
 
తొలుత వ‌చ్చిన 5 రాఫేల్స్‌ను గోల్డెన్ యారోస్‌లో ఇండ‌క్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే జూలైలో వ‌చ్చిన విమానాలు అర‌బ్ ఎమిరేట్స్‌లోని అల్ ద‌ఫ్రా ఎయిర్‌బేస్‌లో బ్రేక్ తీసుకున్నాయి.  ఈసారి  మాత్రం మూడు రాఫేల్స్ ఎటువంటి బ్రేక్ లేకుండా ఇండియా రానున్నాయి. 
 
2021 చివ‌రి నాటికి 36 యుద్ధ విమానాల‌ను ఫ్రాన్స్ అందించ‌నున్న‌ట్లు ఇండియ‌న్  ఎంబ‌సీ పేర్కొన్న‌ది.  రెండ‌వ స్క్వాడ్ర‌న్ విమానాల‌ను బెంగాల్‌లోని హసిమ‌రా ఎయిర్‌బేస్‌లో ఉంచ‌నున్నారు.