జాన్ ధన్-ఆధార్-మొబైల్ లతో రూ 1.70 లక్షల ఆదా  

జన ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు డబ్బు పంపే విధానంతో మధ్యవర్తుల చేతుల్లోకి పోకుండా రూ 1.70 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగింది. 51 మంత్రిత్వ శాఖల 351 పథకాలలో అమలు చేసిన మోదీ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) సౌకర్యం ద్వారా ఇది సాధ్యమైంది.

జన ధన్-ఆధార్-మొబైల్ త్రిమూర్తులతో, బోగస్ లబ్ధిదారులను గుర్తించడం, ప్రభుత్వ పథకాలలో లీకేజీలను నివారించడం సులభం చేసింది. గత ఆరు సంవత్సరాల్లో, డిబిటి ప్రణాళిక ప్రకారం లబ్ధిదారుల ఖాతాలకు రూ .12,95,468 కోట్లు పంపిణీ జరిగింది. 2020-21లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, పిడిఎస్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలలో భాగంగా రూ .2,10,244 కోట్లు నేరుగా ఖాతాలకు పంపారు. ‘

ఉదాహరణకు, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ లో, జాబ్ కార్డులు,కార్మికుల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానించబడడంతో పెద్ద సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు పట్టుబడ్డారు. 2019 డిసెంబర్ వరకు 5.55 లక్షల మంది బోగస్ కార్మికులను ఈ పథకం నుండి ఏరివేసారు. .

దీనివల్ల రూ .24,162 కోట్లు దుర్వినియోగం కాకుండా చూసుకున్నారు. లేనిపక్షంలో ఈ మొత్తం అంతా ఈ డబ్బు బోగస్ కార్మికుల ఖాతాలకు చేరి ఉండేది. అదేవిధంగా, డిబిటి పథకం కారణంగా, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాలలో 98.8 లక్షల బోగస్ లబ్ధిదారులు పట్టుబడ్డారు.

నకిలీ లబ్ధిదారుల తొలగింపు ద్వారా రూ 1,523.75 కోట్ల కుంభకోణాన్ని నిరోధింప గలిగారు. ఆధార్, మొబైల్‌ లను అనుసంధానం చేయడం తప్పనిసరి కావించడంతో ప్రభుత్వ రేషన్ పంపిణీలో రూ 66,000 కోట్లకు పైగా ఆదా అయ్యింది. టెక్నాలజీ సహాయంతో మొత్తం 2.98 కోట్ల బోగస్ లబ్ధిదారులను ఈ వ్యవస్థ నుంచి తొలగించడం వల్ల మొత్తం రూ 66,896.87 కోట్లు ఆదా అయ్యాయని ఆహార, ప్రజా పంపిణీ అధికారులు తెలిపారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం, 51 మంత్రిత్వ శాఖలు 2019 డిసెంబర్ 31 వరకు మొత్తం రూ 1,70,377.11 కోట్లు సంబంధంలేని వారి చేతులలోకి చేరకుండా నిరోధింప గలిగారు.

కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాన్ని నిశితంగా పరిశీలించిన ఒక అధికారి ఈ విధంగా చెప్పారు: “జామ్ ట్రినిటీ (జన ధన్-ఆధార్-మొబైల్) మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అవినీతిని నివారించడానికి ఇది విజయవంతమైన ఉదాహరణ. అంతకుముందు ఆధార్ అనుసంధానం లేకపోవడం, బోగస్ కార్మికుల పేరిట డబ్బు మోసం జరుగుతూ ఉండెడిది”.

అదేవిధంగా, పిడిఎస్ నుండి ఎరువుల వరకు, పెట్రోలియం మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడిన అన్ని పథకాలలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆగిపోయింది. “ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ఎల్పిజి సబ్సిడీ, ఎంజిఎన్ఆర్ఇజిఎ, వృద్ధాప్య పెన్షన్, ఉపకారవేతనాలు వంటి సామాజిక సహాయ పథకాలలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు డబ్బును బదిలీ చేయడం జరుగుతున్నది.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) పథకంబి జనవరి 2013 నుండి ప్రారంభమైనా దీనిని ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మిషన్ మోడ్‌లో అమలు చేయడం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎలో డిబిటి పథకాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేసింది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రత్యక్ష బదిలీ కోసం 38 కోట్లకు పైగా జన ధన్ ఖాతాలు, 100 కోట్ల ఆధార్, 100 కోట్ల మొబైల్స్ ఉపయోగపడ్డాయి.