హెచ్‌ 1 బి వీసాల జారీలో  లాటరీ పద్దతికి స్వస్తి  

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ 1 బి వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్దతికి స్వస్తి పలికింది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ పెట్టింది. 

ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డిహెచ్‌ఎస్‌) తెలిపింది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్‌ పాలకవర్గం తెలిపింది.

ఈ దిశగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్‌ సర్కార్‌ లాటరీ పద్దతిని వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి బట్టి వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఏటా హెచ్‌ 1 వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. 

వీటిలో కంప్యూటర్‌ లాటరీ ద్వారా 65 వేల మంది ఎంపిక చేసి హెచ్‌1 బీ వీసాలు కేటాయిస్తారు. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పతోందంటూ ట్రంప్‌ సర్కార్‌ అంటోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్‌1 బీ వీసాను జారీచేస్తారు.