ఉగ్రవాదంలో పాక్ పాత్ర మొత్తం ప్రపంచంకు తెలుసు 

ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్న విషయం యావత్తు ప్రపంచానికి తెలుసునని, దీనిని ఎంతగా నిరాకరించినా సత్యాన్ని దాచిపెట్టలేరని భారత్ స్పష్టం చేసింది. అమెరికా-భారత్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సీమాంతర ఉగ్రవాదం, పాకిస్థాన్ ప్రస్తావన ఉండటం పట్ల పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించింది.

భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదుల్లో అత్యధికులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం తాను బాధితురాలినని చెప్పుకునే ప్రయత్నం చేయరాదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదానికి మద్దతివ్వడంలో పాకిస్థాన్ పాత్ర గురించి యావత్తు ప్రపంచానికి తెలుసునని చెప్పారు. 

ఉగ్రవాదంలో తమ పాత్ర గురించి పాకిస్థాన్ నేతలు సైతం అనేకసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. భారత్ – అమెరికా సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ స్పందనపై మీడియా అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఈ సమాధానం చెప్పారు. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ చర్చల అనంతరం ఇరు దేశాలు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

అన్ని రూపాల్లోని సీమాంతర ఉగ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉగ్రవాద దాడులకు తన భూభాగాన్ని ఉపయోగించకుండా ఉగ్రవాదులపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాయి. 

దీనిపై ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తనను ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదని పాకిస్థాన్ ఒక ప్రకటన చేసింది.