భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి

నిబంధనలను అతిక్రమించి సరిహద్దులోకి ప్రవేశించారని ఆరోపిస్తూ భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడికి పాల్పడింది. వారిపైకి గాజు సీసాలు, రాళ్లు రువ్వింది. తమ వలలను సైతం నేవీ సిబ్బంది చించివేశారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

నేవీ తీరు కారణంగా ఇప్పటికే కష్టాల్లో ఉన్న తాము లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రామేశ్వరం మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి చేయడం ఇటీవల ఇది రెండోసారి.

పది రోజలు కిత్రం వారిపై ఇదే తరహా దాడి జరిగింది. సోమవారం సుమారు 2 వేల మంది మత్స్యకారులు రామేశ్వరం నుంచి 400 పడవల్లో చేపలు పట్టేందుకు వెళ్లారు. పెట్రోలింగ్‌ బోట్‌లో వచ్చిన శ్రీలంక నేవీ సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో పలువురు మత్స్యకారులకు గాయాలయ్యాయి.

దాడిని రామేశ్వరం మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు జేసురాజ్‌ తీవ్రంగా ఖండించారు. విషయంపై కేంద్రం కలుగజేసుకొని శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపి కట్చతీవుకు సమీపంలో మత్స్యకారులు చేపలు పట్టుకునేలా చూడాలని ఆయన కోరారు.