హత్రాస్ దర్యాప్తుపై అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత బాలిక హత్యాచార ఘటనపై సిబిఐ చేపట్టిన దర్యాప్తును ఇకపై అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. దర్యాప్తు పర్యవేక్షణ, బాధితురాలి కుటుంబంతోసహా సాక్షులకు భద్రత కల్పించడం వంటి అన్ని కోణాలను హైకోర్టు పరిశీలిస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 

ఈ కేసు విచారణను ఉత్తర్ ప్రదేశ్ నుంచి తప్పించి వేరే రాష్ట్రానికి అప్పటించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సిబిఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 

దళిత బాలిక హత్యాచార ఘటనకు సంబంధించిన దర్యాప్తును తారుమారు చేసినందున ఈ కేసు విచారణను ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్వహించడం వల్ల న్యాయం దక్కదని ఆరోపిస్తూ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సిబిఐ అలహాబాద్ హైకోర్టుకు సమర్పిస్తుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. బాధితురాలి పేరును తొలగించాలంటూ యుపి ప్రభుత్వం చేసిన పిజ్ఞప్తిని ఆమోదిస్తూ హైకోర్టుకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.