నవంబరు 30 వరకు అన్‌లాక్-5 నిబంధనలే

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన ఆంక్షల సడలింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 30న జారీ చేసిన మార్గదర్శకాలే నవంబరు 30 వరకు అమలవుతాయని తెలిపింది. 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) మంగళవారం ఈ ప్రకటనను జారీ చేసింది. ప్రజల ప్రయాణాలపైనా, సరుకు రవాణాపైనా ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపింది. 

ప్రజలు రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు ప్రయాణించేందుకు, అదేవిధంగా సరుకులను రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు ప్రత్యేకంగా అనుమతులు, ఈ-పర్మిట్లు పొందవలసిన అవసరం లేదని వివరించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో నవంబరు 30 వరకు అష్టదిగ్బంధనం అమలు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సెప్టెంబరు 30న ఎంహెచ్ఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో తెరిచేందుకు అనుమతి లభించింది. పాఠశాలలు, విద్యా సంస్థలను దశలవారీగా తెరవడంపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల  ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. 

కొన్ని షరతులకు లోబడి 100 మందికి పైగా సాంఘిక, మతపరమైన, రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగించింది. 

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం మార్చి 25 నుంచి మే 31 వరకు అమలైన సంగతి తెలిసిందే. జూన్ నుంచి దశలవారీగా అన్‌లాక్ మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నాయి.