ఎవరి ఏకత్వం, ఎవరితో ఏకత్వం?. మతాల మధ్య ఏకత్వమా?. మానవులంతా ఒక్కటే అన్న అర్థంలో ఏకత్వమా?. లేక ‘ బంగారు నగలు కొనేవారంతా ఒక్కటే’ అన్న ఏకత్వమా? లేక మీ సంస్థ అందరికీ ఒకే రకమైన నగలు అమ్ముతుందీ అన్నఏకత్వమా? ఏరకమైన ఏకత్వం.?
గత కొన్ని రోజులుగా అందరం గమనించిన వివాదాస్పద వ్యాపార ప్రకటన, తత్సంబధిత చర్చ ఇప్పటిలో ముగిసేటట్టు కనిపించడం లేదు. వాదప్రతివాదాలు అఖండంగా సాగుతున్నాయి. యథాప్రకారం తమను తాము మేధావులుగా, లిబరల్స్ గా ఊహించేసుకొని తమకు అలవాటైన మూర్ఖమైన వాదనకు దిగుతూ కొందరు ఈ విషయంలోని వాస్తవ అభ్యంతరాలను గమనించటం లేదు. అసలు ఆ ప్రకటన ఎందుకు తయారైందీ? ” తనిష్క్” అనే నగల అమ్ముకొనే ఒక వ్యాపార సంస్థ ‘ఏకత్వం’ అనే పేరుగల ఒక నగల కలెక్షన్ ను అమ్ముకోవటానికి. ఇంత వరకూ ఈ లిబరల్స్ గుంపు ఒప్పుకొని తీరాలి. ఆ కంపెనీ వారు వ్యాపారసూత్రాన్ని అర్ధం చేసుకొని ఆ వివాదాస్పద ప్రకటన వెనక్కి తీసుకొన్నారు. బాగానే ఉంది కానీ ఈ విషయాన్ని ఈ లిబెరల్స్ ఇంకా ఎందుకు పొడిగిస్తున్నారు.
సామాన్య ప్రజలు కూడా తమ విచ్ఛిన్నవాద ఎజెండాని స్పష్టంగా గ్రహిస్తున్నారు, అర్ధం చేసుకోగలుగుతున్నారు అన్న కోపమా ? లేక సహజంగా సహనంతో ఉండే జనబాహుళ్యం కూడా ఈ ఏకపక్ష , హిందూ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తున్నారు అన్న అంతర్గత భయమా ? కుహనా ఉదారవాద, మతాంతరీకరణ శక్తుల ఆటలు సాగవేమో అన్న దిగులా?
తనిష్క్ తమ అధికారిక వెబ్సైటులో పొందుపరిచిన వివరాలు చూస్తే..
“Ekatvam.. A confluence of India’s finest craft forms, intricately knitted into one stunning collection, brought alive by our skilled Karigars, where similarities and differences all become one. 1000 Karigars | 15 Craft Forms | 1 Stunning Collection.” ఈ ఏకత్వం థీమ్ ప్రకటన కూడా.. “The beauty of oneness”
సోర్సు: https://www.tanishq.co.in/ekatvam
ఈ థీమ్ కి సరిపోయే ఒక వ్యాపార ప్రకటన తయారు చెయ్యాలి. అందుకోసం బ్రాండ్ మేనేజర్, అతని బృందం కొంత మేధోమధనం చేసి ఉంటారు. వారి దృష్టికి వచ్చిన “ఏకత్వం” హిందూ ముస్లిం ఐక్యత గురించే అయి ఉంటుంది. సామాన్యంగా ప్రతీ సగటు భారతీయుడి కోరిక కూడా అదే. సరే ఈ విషయంలో ఎటువంటి వివాదమూ లేదు.
“హిందూ – ముస్లిం”లను తమ అద్భుతమైన ఆలోచనతో, సృజనాత్మక శక్తితో కలిపేద్దామని కూడా వారు ఉత్సాహపడి ఉండవచ్చు. ఆ తరువాతే వారి అమోఘ సృజనాత్మకతని అర్థం చేసుకోలేని ఫైనాన్స్ విభాగానికి చెందిన వ్యక్తి వచ్చి “మీ ఆలోచన ఎలా ఉంటే నాకెందుకు, మన నగలను ఎలా చూపిస్తారు, ఎంత బడ్జెట్ లో తీస్తారు?” అంటూ ఖర్చు, బడ్జెట్ విషయాలు కదిలించి ఉండాలి. అప్పుడే వారికి తమ కర్తవ్యం గుర్తుకు వచ్చి “అవును, మన పని నగలు అమ్మటం కూడా కదూ..” అని జ్ఞానోదయమై ఉంటుంది.
నగలు కొనవలసిన వారు స్త్రీలు కాబట్టి వారిని పాత్రలుగా ఎంచుకుంటే బాగుంటుంది అనుకొనీ ఉండవచ్చు. సరే బాగుంది. ఏయే సందర్భాల్లో స్త్రీలు ఉద్వేగంతో ఉంటారు అనీ కూడా ఆలోచించి ఉండాలి.. అదీ కూడా బాగుంది. ఆ తర్వాతే అసలు విషయం మొదలై ఉండాలి. ఈ ఉద్వేగాన్నీ వారు ‘హిందూ-ముస్లిం ఏకత్వం’ అనే అంశంలోకి తీసుకోవటమే అసలు సమస్య.
ఒక గర్భవతి ఉద్వేగభరిత పరిస్థితి గురించి, “సీమంతం” అనే వేడుకనీ, అది కూడా హిందూ ధర్మాన్ని అనుసరించే వారు చేసే వేడుకని (ముస్లిం సంప్రదాయంలో ఈ వేడుక లేదని ప్రకటనలోనే చెప్పారు) ఆధారంగా ఈ వివాదాస్పదమైన ప్రకటన తయారైంది. ఆ ప్రకటన 9 అక్టోబర్ 2020న వెలువడింది అంటే దాదాపు ఒక నెల ముందు నుంచీ ఈ మొత్తం ప్రణాళిక సిద్దమైవుంటుంది కదా? ఇది కూడా అందరూ ఒప్పుకుంటారనే తలుద్దాం.
సెప్టెంబర్ నెలలో అనుకుంటే ఏ బ్రాండ్ మేనేజర్ అయినా, ఏ మార్కెటింగ్ నిపుణుడైనా రాబోయే పండుగల సీజన్ గురించి కదా ఆలోచించాలి? ఆ పండుగలు యావత్భారతదేశానికే ముఖ్యమైన పండుగలు కదా. అటువంటప్పుడు ఆ పండుగలను దృష్టిలో పెట్టుకునికదా వ్యాపార ప్రకటన ఉండాలి? మరి అదేమిటో వారి ప్రకటన మాత్రం హిందూ ముస్లిం ఏకత్వం మీదనే ఉంది? వాళ్ళు చేసుకునే వ్యాపార ప్రకటన లక్ష్యం అమ్మకాలు పెంచడమే కదా? అప్పుడు దృష్టి ఏ అంశం మీద ఉండాలి?
‘ఏకత్వం’ అన్నదే ప్రధాన ఇతివృత్తంగా వారు ప్రకటన చేయాలనుకున్నారని కాసేపు లిబరల్స్ లాగా అనుకుందాం. ఆ ప్రకటన ఒకసారి గమనిస్తే.. సీమంతం వేడుకలో కనిపించాల్సిన కోడలి పుట్టింటి వారు, మరీ ముఖ్యంగా కోడలి తల్లి పాత్ర ఎందుకు ఎక్కడా ప్రముఖంగా కనిపించలేదు? ఎందుకు ఒకవైపు ముస్లిం స్త్రీలు, మరోక వైపు హిందూ స్త్రీలు విడివిడి గ్రూపులుగా నిలబడ్డారు? ఎందుకు కలిసిపోయి నిలబడలేదు? అంటే ఆ అత్త కోడలు కలిస్తే చాలనా? కుటుంబాలు కలవనవసరం లేదా?
సీమంతంలో కనిపించాల్సిన ముఖ్యమైన గాజులు, అక్షంతలు ఎందుకు కనిపించలేదు? అసలు సీమంతం లేదా గోధ్ భరాయ్ అనే వేడుకలో ఉండాల్సిన పాటల హడావిడి ఎందుకు కనిపించలేదు? ఆడవారి కార్యక్రమంలో ఆ ముస్లిం టోపీ పెట్టుకుని తెగపని చేస్తూ తిరుగుతున్న వ్యక్తి ఎవరు? ఈ నలభై సెకండ్ల ప్రకటనలో కనిపించే ప్రతి ఫ్రేములో జాగ్రత్తగా ఇరువర్గాల వైపు సమతుల్యంగా ఉంచాలి కదా? ముస్లిం ఇల్లు అని చూపించిన తరువాత, మళ్ళా అక్కడే బురఖా ధరించిన స్త్రీలను చూపించడం ఎందుకు? అసలు ముస్లిం స్త్రీలు ఇంట్లో బురఖా ధరిస్తారా? ఈ ప్రశ్నలను వేసుకుంటే.. ఈ లిబరల్స్ కు కూడా తేటతెల్లం గా అర్థం అవుతుంది ఈ ప్రకటన ఉద్దేశ్యం ఏకత్వం కాదూ ఆ ముసుగులో “ముస్లిం సముదాయం చాలా ఉదారవాదులని చూపటం’’ అని.
నిస్సిగ్గుగా ఛాందస ముస్లిం గుర్తులు చూపిస్తూ అది ఉదారవాదం అంటూ ప్రేక్షకులను ఉర్దూ పదాలతో ఊదర గొట్టడం వంటివి వారికి కనిపించలేదా? ఏ ఏకత్వం కోసం అయినా “హిందీ” వాడవచ్చునుకదా. అలా ఎందుకు చేస్తారు? వారి ఉద్దేశ్యం నిజంగా ఏకత్వమేనా?
ఒక వ్యాపార సంస్థ వారి వ్యాపార అవసరాలను గుర్తించి సమాజం వేలేత్తి చూపిన తప్పులను గమనించి వెంటనే ఆ వివాదాస్పద ప్రకటన ఉపసంహరిస్తే ఈ లిబరల్స్ అనే పేరు పెట్టుకున్నవారు మాత్రం ఇంకా ఆ అంశాన్ని ఎందుకు కొనసాగిస్తున్నట్టు? వీరి ఉద్దేశ్యంలో ఒక పక్షాన్ని మాత్రమే గొప్పగా చూపించడమే ఏకత్వమా? అదేనా ఐకమత్యం? వారు ఆమోదించిన భావజాలాన్నే అందరూ భరించాలా? “గిచ్చి, గిల్లి రెచ్చగొట్టి, అదేంటీ అంటే.. చూశారా మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారూ” అంటూ సన్నాయి నొక్కులు. ఇప్పటికే మీ మూర్ఖత్వం దేశవ్యాప్తంగా తేటతెల్లంగానే ఉంది. సహనశీలురైన సగటు భారతీయులు కూడా అసహ్యించుకునే మూర్ఖవాదనలు కట్టిపెట్టి పనికి వచ్చే విషయాలమీద దృష్టి సారించండి.
-చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
More Stories
నిజాం ఇస్లాం రాజ్యం కలలను చిత్తు చేసిన `హైదరాబాద్ విముక్తి’
జన గణన కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు
ఉత్తరాఖండ్ లో రాత్రికి రాత్రి 2 లక్షల మంది ముస్లిం బాలల అదృశ్యం!