* జయంతి సందర్భంగా నివాళి
సోదరి నివేదితగా మనందరికీ పరిచితురాలై న మార్గరెట్ ఎలిజిబెత్ నోబెల్ ఐర్లాండ్ వనిత. 1867 అక్టోబర్ 28న జన్మించిన ఆమెపై ఆంగ్లేయుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఐర్లాండ్ లో పోరాడు తున్న తాతగారి ప్రభావం పడింది. తదుపరి స్వామి వివేకానంద బోధనలతో ప్రభావితమై, ఆయన స్పూర్తితో భారత స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు
17 ఏళ్లకే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఆమె ఐర్లాండ్, ఇంగ్లాండ్ లలోని పలు పాఠశాలలో పనిచేశారు. 1882లో వింబెల్ డోన్ లో తన సొంత పాఠశాలను స్థాపించారు. మంచి రచయితగా, ఉపన్యాసకురాలిగా పేరొందిన ఆమె లండన్ లోని ప్రముఖ ఆంగ్ల రచయితలు జార్జ్ బెర్నార్డ్ షా, థామస్ హుస్లెయ్ వంటి వారితో పరిచయం పెంచుకున్నారు.
1885లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన స్వామి వివేకానందాను కలుసుకున్న ఆమె ఆయన మానవీయ బోధనలు, వేదాంతలోని విశ్వజనీత భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి, ఆయన ఆదేశంపై 1898లో భారత్ కు వచ్చారు. కేవలం భారత దేశంలోని మహళలను విద్యావంతులు కావించాలనే వివేకానంద ఆశయం నెరవేర్చడం కోసమే ఆమె భారత్ కు వచ్చారు.
మొదట్లో కొలకత్తాలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు. భారతీయ విలువలు, పాశ్చాత్య ఆలోచనలకు మేలు కలయికగా ఆమె పాఠశాల కొనసాగించారు. అయితే 1889 లోనే ఆ పాఠశాలను మూసివేసి, విరాళాల సేకరణ కోసం విదేశాలకు వెళ్లి, 1902లో తిరిగి భారత్ కు వచ్చారు. చదువుకు దూరంగా ఉంటున్న యువతులను ఎంతో శ్రమపడి పాటలకు రప్పిస్తూ, వారికి కళలు, చేతి వృత్తులలో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
ప్రజలు ప్లేగ్ అంటువ్యాధితో, వరదలు, దుర్భిక్షంలతో బాధపడుతున్న సమయంలో కొలకత్తాలోనే కాకుండా మొత్తం బెంగాల్ లో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల దృష్టి సారించారు. 1902లో వివేకానంద మృతి చెందిన తర్వాత భారత దేశం రాజకీయంగా సాధికారికత సాధించాలని అంటూ స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 1905లో బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు.
భారతీయ చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని, బ్రిటిష్ నుండి దిగుమతయ్యే వస్తువులను బహిష్కరించి, స్థానిక వృత్తుల వారి జీవనోపాధి కల్పించాలని అంటూ `స్వదేశీ’ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నారు. వివేకానంద ఆమెకు `నివేదిత’అనే పేరు ఇస్తే, భారత ప్రజలు `సోదరి’ అని చేర్చి పిలవడం ప్రారంభించారు.
ప్రజా ఉద్యమాలలో తన ఆరోగ్యాన్ని పట్టించుకొనక పోవడంతో 44 ఏళ్ళ వయస్సులోనే 1911లో ఆమె మృతి చెందారు. ఆ సందర్భంగా ఆమెకు సన్నిహితుడైన రవీంద్రనాథ్ టాగోర్ ఆమె “ప్రజలకు మాతృమూర్తి” అంటూ కొనియాడారు.
కాశ్మీర్ తో సహా భారత దేశం అంతటా విస్తృతంగా పర్యటనలు జరిపిన ఆమె భారత ప్రజలతో కలిసిపోయేవారు. 1901లో అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా భారత స్వతంత్ర ఉద్యమ నేత బిపిన్ చంద్రపాల్ ప్రసంగం వింటుండగా స్థానికులు “ముందు మీ దేశానికి స్వాతంత్య్రం సంపాదించండి. ఆ తర్వాత మీ మతం, మీ తత్వశాస్త్రం గురించి చెబితే మేము వింటాం” అనడం ఆమెపై చెప్పుకోదగిన ప్రభావం చూపింది.
భారతీయులు ముందుగా స్వతంత్య్రం పొందితే గాని విదేశాలలో గౌరం పొందలేరని అర్ధం చేసుకున్నారు. అందుకనే ఆ తర్వాత ఆమె ఎక్కువగా భారత స్వతంత్ర పోరాటంపై దృష్టి సారించారు.
స్వామి వివేకానందతో కలసి రామకృష్ణ మఠం ఏర్పాటులో ఆమె కూడా సహకారం అందించి, ఆ మఠం కార్యకలాపాలలో క్రియాశీలంగా పాల్గొంటూ వస్తున్నా, స్వతంత్ర పోరాటం పట్ల దృష్టి సారించడం కోసం ఆ మఠంకు దూరంగా ఉంటూ వచ్చారు
మఠం రాజకీయాలకు దూరంగా పనిచేయవలసిన సంస్థ కావడంతో, అక్కడి స్వాములతో సమాలోచనలు జరిపి, వారితో ఆమె 1902 జులై 19న ఒక ప్రకటన ఇప్పించారు. “నేటి నుండి నివేదిత స్వతంత్రురాలు. తన కార్యక్రమాలను స్వతంత్రంగా జరుపుకొనే స్వేచ్ఛ ఆమెకు ఉంది” ఆ ప్రకటన సారాంశం. అయితే మఠంతో సంబంధాలను చివరి వరకు కొనసాగించారు
తన పర్యటనలలో ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూనే దేశ స్వాతంత్య్రం, స్వదేశీ ఉద్యమంల గురించి విస్తృతంగా ప్రచారం చేసేవారు. 1904లో నాగపూర్ లో క్రికెట్ బహుమతి కార్యక్రమంకు ఆహ్వానించినప్పు డు “మీరు విదేశీ క్రీడల పట్ల మోజు చూపడం బాధగా ఉంది. మీకు స్వదేశీ క్రీడలు రావా? మరాఠీ శౌర్య ప్రతాపాలను, వారి క్రీడలను ప్రదర్శిస్తారని నేను ఆశపడ్డాను” అంటూ నిర్మోహాటంగా చెప్పేసారు.
బుద్ధగయలో `ఆసియాలో మహ్మదీయ మతం’ అనే అంశంపై ప్రసంగిస్తూ “మహమ్మదీయుల ఆక్రమణ శకం ముగిసింది. ఇప్పుడు మీరు భారతీయ ముస్లింలు. మీ తక్షణ కర్తవ్యం భారత భూమితో ఏకీకరించు కోవడమే. భారత భూమి ముస్లింల జన్మ భూమిగా మారడంతో మీరు భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంలో దుమికి భారత జాతి నిర్మాణం కోసం కంకణం కట్టుకోవాలి” అంటూ పిలుపిచ్చారు.
లార్డ్ కర్జన్ ప్రవేశ పెట్టిన నూతన విశ్వవిద్యాలయ చట్టంపై వ్యతిరేకంగా సనాతన భారతీయులతో పాటు ఆమె కూడా తన స్వరం వినిపించారు. ఈ సందర్భంగా `జాతీయ చైతన్యం’ అనే పదాన్ని మొదటగా దేశంలో ఆమెయే ప్రయోగించారు. స్వతంత్ర ఉద్యమకారులు ఏర్పర్చిన పలు సంస్థలు, విప్లవ ఉద్యమాలతో ఆమె సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండేవారు.
తన పాఠశాలలో వందేమాతరం గీతాన్ని ఆమె ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సమావేశాలలో ఆమె నేరుగా పాల్గొనక పోయినా సమావేశాలకు వచ్చే నాయకులను కలసి, సమాలోచనలు జరుపుతూ ఉండేవారు. సమావేశాలలో నాయకులు అతివాదులు, మితవాదులుగా విడిపోవడం పట్ల తన అసంతృత్తిపని వ్యక్తం చేస్తూ ఒక వ్యాసం కూడా వ్రాసారు. ఆ విధంగా పరస్పరం సంఘర్షించుకోవడం తగదని అంటూ హితవు చెప్పారు.
దేశానికి ఒక పతాకం అవసరమని భావించి, 1906లో తన పాఠశాల విద్యార్థులతో సింధూరం, పసుపు వర్ణములతో కూడిన జెండాపై వజ్రాయుధంతో తయారు చేయించి, కాంగ్రెస్ మహాసభలలో ప్రదర్శింప చేశారు. జైలుకు వెళ్లిన స్వతంత్ర ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంభం సభ్యులను పరామర్శిస్తూ ఉండేవారు. వారి విడుదల సందర్భంగా తోరణాలతో తన పాఠశాలతో ఒక పండుగ వలే జరిపించేవారు.
అనేక విప్లవ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న అరవింద్ ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుండగా తాను నడుపుతున్న “కర్మయోగిన్’ పత్రికను నడిపే బాధ్యతను నివేదితకు అప్పచెప్పి, ఫ్రెంచ్ పాలనలో ఉన్న చందర్ నాగోర్ కు ఆయన వెళ్లిపోయారు. ఆ పత్రికను మూడు నెలలపాటు ఆమెయే నడిపారు.
ఆమె కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచేవారు. ఆమె ఉత్తరాలు, కదలికలపై కన్ను వేసేవారు. స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణ కలిగిస్తూ ఆమె ప్రసంగాలు, వ్యాసాలు ఉంటూ ఉండెడివి. ఆమె స్వదేశీ ఉద్యమం కేవలం విదేశీ వస్త్రాల బహిష్కరణకు పరిమితం కాలేదు. వివిధ రంగాలలో ఆమె అనేక ప్రయోగాలు చేశారు.
ఆమె కోలకత్తాకు మొదటగా వచ్చినప్పుడు క్రైస్తవ మిషనరీ అనుకోని తమ పిల్లలకు ఆంగ్లం బోధింపమని రవీంద్రనాథ్ టాగోర్ కోరారు. అయితే భారతీయ బాలలపై విదేశీ ఆదర్శాలను రుద్దరాదని, వారి వారి భాషల ద్వారా జాతీయ ఆదర్శాలు వారిలో నింపాలని ఆమె సూచించారు. ఆమె మాటలే టాగోర్ ను ఆమె పట్ల ఆకర్షితులయ్యేటట్లు చేశాయి. తాను నడిపిన పాఠశాలలో విద్యలో స్వదేశీపై అనేక ప్రయోగాలు చేశారు.
డా. జగదీశ్ చంద్రబోస్ ను కలసి, ఆమె పరిశోధనల పట్ల ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ పాలకులు ఆయనకు కల్పిస్తున్న అడ్డంకుల పట్ల వేదన చెందారు. ఆయన పరిశోధనలను గ్రంథస్థం చేయడం, ముద్రించడంలో 1907 వరకు ఆమె ఎంతో సమయం కేటాయించారు.
భారతీయ శాస్త్రజ్ఞులను ప్రోత్సహించడం కోసం ఒక దేశీయ శాస్త్రీయ సంస్థను స్థాపించాలని ఆమె ఎంతగానో కోరుకొంటుండేవారు. ఆమె 1911లో మరణించన తర్వాత 1917లో బోస్ ఆమె జ్ఞాపకార్ధం ఆ సంస్థను స్థాపించారు. ఆ సంస్థలో అడుగు పెట్టగానే ఆమెకు గుర్తుగా ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కాగడా గల ఒక స్త్రీమూర్తి పద్మాలపై స్వాగతం పలికే విగ్రహంను ఏర్పాటు చేసారు.
అదే విధంగా భారతీయ రాజకీయ, ఆర్ధిక శాస్త్రాలను పశ్చిమ భావాలతో కాకుండా భారతీయ దృక్పధంతో వ్రాయాలని సూచిస్తూ ఆమె అనేక వ్యాసాలు వ్రాసారు. భారతీయ కళల గురించి కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. అవి పాకృతమైనవని, ప్రాచీనమైనవని, గ్రీక్ నుండి ఉద్భవించినవి కావని స్పష్టం చేస్తూ ఉండేవారు. భారతీయ చిత్రకళ పుననిర్మాణం భారతీయ పునర్జీవనంకు ఆవశ్యమని వాదిస్తుండేవారు.
(మన తెలంగాణ నుండి)
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’