కేరళ బంగారం రవాణా కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌

కేరళ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతున్న  బంగారం అక్రమ రవాణా కేసులో మరో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరైన రాబిన్స్ హమీద్‌ను కొచ్చి విమానాశ్రయంలో ఎన్‌ఐఏ సోమవారం అదుపులోకి తీసుకున్నది. అతనిపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అతడిని యూఏఈ ప్రభుత్వం బహిష్కరించింది. అక్టోబర్ 6 న ప్రధాన నిందితుడు ఫైసల్ ఫరీద్, రాబిన్స్ హమీద్‌లను యూఏఈ అధికారులు అరెస్టు చేశారు.

రాబిన్స్ హమీద్ (ఏ-10), ఇతర నిందితులు రమీస్ కేటీ (ఏ-5), జలాల్ ఏఎమ్ (ఏ-6), ఇతరులతో కలిసి కుట్ర పన్నారని, నిధులు ఏర్పాటు చేసి బంగారం కొన్నారని ఎన్‌ఐఏ వెల్లడించింది. దుబాయ్ నుంచి దౌత్య సామాను ద్వారా భారతదేశానికి అక్రమ రవాణాలో వీరు ప్రధాన పాత్ర పోషించారని, పారిపోయిన రాబిన్స్ హమీద్‌పై ఎర్నాకుళంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వని వారెంట్ జారీ చేసింది” అని ఎన్ఐఏ తెలిపింది. 

జూలైలో తిరువనంతపురం విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 30 కిలోల బంగారం అక్రమ రవాణాలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాబిన్స్‌ హమీద్ ప్రమేయం ఉన్నదని భావిస్తున్నారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌కు సంబోధించిన సామానులో బంగారం అక్రమ రవాణా జరిగిందని ఎన్‌ఐఏ గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. 

 మరోవంక,ఈ కేసును విచారిస్తున్న కస్టమ్స్ విభాగం ఈ కేసులో ఎమ్మెల్యే కారత్ రజాక్ పేరును కేంద్రానికి సమర్పించింది. కోజికోడ్ జిల్లా కొడువల్లికి చెందిన ఎల్‌డీఎఫ్ మద్దతుగల స్వతంత్ర ఎమ్మెల్యే ఈ ఆరోపణలను ఖండించారు. ప్రధాన నిందితుడు సందీప్ నాయర్ భార్య సౌమ్య బీఎస్.. ఈ కేసులో కారాత్ రజాక్ పాత్రను, బంగారు స్మగ్లింగ్ ముఠాతో తన సంబంధాలను వెల్లడించారు.

 ఈ కేసులో మరో నిందితుడు సరిత్  పీఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇచ్చిన ప్రకటనలో కేరళ మంత్రులు కడకాంపల్లి సురేంద్రన్, కేటీ జలీల్ యూఏఈ కాన్సులేట్‌ను పలు సందర్భాల్లో సందర్శించినట్లు వెల్లడించారు. 

యూఏఈలో తన కొడుకు ఉద్యోగ నియామకానికి సంబంధించి కదకంపల్లి సురేంద్రన్ ఒకసారి యూఏఈ కాన్సుల్ జనరల్‌ను సందర్శించారని ఆయన తెలిపారు. రంజాన్ కిట్ల పంపిణీ కోసం కాన్సులేట్ నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి జలీల్ యూఏఈ కాన్సులేట్‌ను సందర్శించారని సరిత్ పీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.