గత రాత్రి సిద్దిపేట వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి, దౌర్జన్యంగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహితం ఈ చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే విషయం తెలిసి సీఎం కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని, పిరికిపందలా వ్యవహరిస్తున్నారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ ఇంట్లో పోలీసులు సోదాలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.
కేంద్రం ఓపికతో ఎదురుచూస్తున్నదని, కేసీఆర్ ఇట్లనే వ్యవహరిస్తే ఆయన సంగతి కూడా చూస్తుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని, ప్రజలపై దాడులు, హింస పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు. పోలీసులను నిజాం ఎలా ఉపయోగించుకున్నడో…సీఎం కేసీఆర్ కూడా అట్లనే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని దుబ్బాక ఓటర్లు ఎదరుచూస్తున్నారని వివేక్ స్పష్టం చేశారు. హుజూర్ నగర్ తో పాటు ఇతర ఉప ఎన్నికల్లోనూ పోలీసులను ఉపయోగించి వాళ్ల వాహనాలలో టీఆర్ఎస్ పార్టీ డబ్బు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావును అరెస్టు చేయించాలని చూస్తున్నారని, దీంతో డబ్బులు పంచి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిపై జరిగిన చర్య ముమ్మాటికి అధికార దుర్వినియోగమే.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు విచారకరం… ఒక పార్లమెంటు సభ్యుని పట్ల పోలీసుల తీరు ఆక్షేపనీయం’’ అని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, దుందుడుకు చర్య అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని, బీజేపీ అభ్యర్థిని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయమని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ నేత, ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీపీ జోయల్ డేవిస్ పోలీసా గూండానా అని ధ్వజమెత్తారు. జోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ‘‘జోయల్ నా పేరు అరవింద్.. నీ పేరును నేను గుర్తు పెట్టుకుంటా’’ అంటూ అరవింద్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర