దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు 

దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.  ‘దసరా సందర్భంగా తోటి పౌరులకు శుభాకాంక్షలు. ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. పండుగ మహమ్మారి చెడు ప్రభావాల నుంచి మనల్ని కాపాడుతుంది. దేశ ప్రజలకు శేయస్సు, సంపదను తీసుకువస్తుందని’ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

‘దేశ ప్రజలందరికీ అభినందనలు. చెడుపై మంచి విజయాన్ని సాధించిన గొప్ప పండుగ అనీ, ప్రతి ఒక్కరి జీవితాన్ని కొత్త స్ఫూర్తిని తెచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. 

అంతకు ముందు నవరాత్రి వేడుకల్లో దుర్గామాత తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా పూజలందుకుంటుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తమ పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి (దసరా) పండుగ శుభసందర్భంలో దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని పేర్కొన్నారు.

అయితే ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి  నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమనిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలుగజేయాలని ఆకాంక్షించారు.