పంజాబ్  అత్యాచారంపై అన్నాచెల్లెళ్లు మౌనమెందుకు?

పంజాబ్  అత్యాచారంపై అన్నాచెల్లెళ్లు మౌనమెందుకు?

పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.

రాజకీయ స్వార్థంతోనే రాహుల్, ప్రియాంక గాంధీ అత్యాచార ఘటనలను రాజకీయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎంపిక చేసుకున్న ఘటనల పై మాత్రమే వారు మాట్లాడుతున్నారని దయ్యబట్టారు. ఆ చిన్నారి  కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ అండగా నిలబడుతుందని ఆమె హామీ ఇచ్చారు.

ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సోదరులపై గతంలో రేప్ కేసులు ఉన్నాయని, అందుకే వారు ఈ ఘటనపై మాట్లాడటం లేదని నిర్మల సీతారామన్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీడియాపై దాడులు జరుగుతున్నాయని, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

కాంగ్రెస్, వామపక్ష మేధావులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిర్మల సీతారామన్  ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మేము ఏమి  చేస్తామో మేనిఫెస్టోలో చెప్పే హక్కు తమకు ఉందని ఆమె స్పష్టం చేశారు. కరోనా ఫ్రీ వ్యాక్సిన్ అంశం పై మాట్లాడుతూ, ఇది రాష్ట్ర జాబితాలోని అంశమని ఆమె గుర్తు చేశారు.

కాగా, రాహుల్ గాంధీ ‘పొలిటికల్ టూర్స్’ ను ఆపేయాలి. వెంటనే పంజాబ్‌లోని తాండా గ్రామంలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. పంజాబ్ లో మహిళలపై జరుగుతున్న నేరాలను తెలుసుకోవాలని మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హితవు చెప్పారు.

యూపీలో హాథ్రస్ ఘటన సందర్భంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన వారు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తాండా బాధిత కుటుంబాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక పరామర్శించలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మహిళలకు జరిగిన అన్యాయాన్ని వారు పట్టించుకోరని దుయ్యబట్టారు.